- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
- కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని వెల్లడి
- ఇందిరాపార్కు వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్, వెలుగు: యూఎస్ ట్రేడ్ డీల్ చట్టాలతో ప్రధాని మోదీ అమెరికాకు దేశాన్ని తాకట్టు పెట్టారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాకెట్లు తయారు చేసే స్థాయికి రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని అభివృద్ది చేస్తే.. ప్రధాని మోదీ మాత్రం అమెరికాకు దాసోహమయ్యేలా దేశాన్ని మారుస్తున్నారని ధ్వజమెత్తారు.
యూఎస్ ట్రేడ్ డీల్ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ‘మోదీ కో హటావో.. కిసాన్ కో బచావో’ అంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యూత్ నేతలు పెద్ద ఎత్తున్న ఇందిరా పార్కుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హాజరై మాట్లాడారు.
పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం బీజేపీకి చెంపపెట్టులాంటిదన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే తీసుకున్న నిర్ణయంతో దక్షిణాదికి న్యాయం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడతామని, ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధర్నాలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తదితరులు పాల్గొన్నారు.

