నాపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు: రేవంత్

నాపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు: రేవంత్

కాంగ్రెస్ పార్టీలో తనను ఒంటరివాడిని చేశారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తనపై ఎందుకంత కక్ష అని, పీసీసీ చీఫ్ పదవి కోసం ఇలా చేస్తారా..? అని ప్రశ్నించారు. తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఉద్వేగభరితంగా చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి, తనను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలనే కుట్ర జరుగుతోందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ గమనించాలని కోరారు. తనను అభిమానించే కాంగ్రెస్ కార్యకర్తలకు తన మనసులోని బాధను చెబుతున్నాని తెలిపారు. తాను పీసీసీ చీఫ్ గా ఉండడం వల్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందంటూ ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే సొంత పార్టీ నాయకులే కేసీఆర్ తో కలిసి కుట్రలు చేస్తున్నారని, త్వరలోనే ఆ నిజాలు తెలుస్తాయని చెప్పారు. 

తనకు పీసీసీ చీఫ్ పదవి శాశ్వతం కాదని, సోనియాగాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమేనని, పదవులు ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ గా పదవి చేపట్టినప్పటి నుంచి తనపై బీజేపీ, టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ నాయకులు, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారని, ఈ మధ్యే ఢిల్లీలో ఉండి నరేంద్ర మోడీ, అమిత్ షాతో రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని అమిత్ షా, కేసీఆర్ పన్నిన కుట్రలో భాగంగానే ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం సీఆర్ పీఎఫ్ బలగాలను మునుగోడులో తిష్ట వేయించి.. నియోజకవర్గం ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని, పార్టీ కార్యకర్తలందరూ మునుగోడుకు వచ్చి ప్రచారం చేసి, పాల్వాయి స్రవంతిని గెలిపించాలంటూ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీ దెబ్బలకు ఎవరూ భయపడొద్దని, ప్రాణాలు ఇచ్చి అయినా కాంగ్రెస్ పార్టీని బతికిద్దామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రాణాలు ఇచ్చేందుకు చివరి శ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీ కోసం తాను పని చేస్తానని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని చంపాలని చూస్తున్నాయని, ఒకసారి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కుట్రలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు, పోరాటాలు చేయాలంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.