V6 News

ఇరాన్ షిప్ సీజ్ చేసి అమెరికా నేవీ వీడియో రిలీజ్ : పాకిస్తాన్‌లో చర్చలకు ఇరాన్ దూరమయ్యే అవకాశం.. 

ఇరాన్ షిప్ సీజ్ చేసి అమెరికా నేవీ వీడియో రిలీజ్ : పాకిస్తాన్‌లో చర్చలకు ఇరాన్ దూరమయ్యే అవకాశం.. 

హార్ముజ్ జలసంధి వద్ద విధించిన దిగ్బంధనాన్ని ధిక్కరించి ఇరాన్ జెండాతో వెళ్తున్న టౌస్కా అనే భారీ కార్గో షిప్‌ను అమెరికా నేవీ స్వాధీనం చేసుకుంది. దాదాపు 6 గంటల పాటు అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన ఈ నౌకను.. యూఎస్ఎస్ స్ప్రూయెన్స్ క్షిపణి విధ్వంసక నౌక దాని ఇంజిన్ రూమ్‌ను ధ్వంసం చేయడం ద్వారా సముద్రం మధ్యలోనే నిలిపివేసింది. తర్వాత అమెరికన్ మెరైన్లు హెలికాప్టర్ల ద్వారా నౌకపైకి దిగి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్న విజువల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఇది జస్ట్ ఇరాన్ నౌక స్వాధీనంతో ముగిసిపోయేలా లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆపరేషన్‌ను గర్వంగా ప్రకటించగా.. ఇరాన్ మాత్రం దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ ఘటనకు ప్రతిచర్యగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హార్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను వెనక్కి తగ్గేలా చేసాయని ఇరాన్ మీడియా చెబుతోంది. సముద్ర మార్గంలో పెరిగిన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు రాజకీయ చర్చలపై కూడా నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ రెండో రౌండ్ చర్చలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.

తౌస్కా షిప్ సీజ్ తర్వాత ఇరాన్ తీవ్ర అసంతృప్తితో ఉందని సమాచారం. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరగాల్సిన 2వ రౌండ్ శాంతి చర్చలకు హాజరుకాకూడదని ఇరాన్ యోచిస్తోందట. తన జెండా ఉన్న నౌకను అమెరికా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తమ సార్వభౌమాధికారంపై దాడిగా ఇరాన్ భావిస్తోంది. చర్చల టేబుల్ వద్ద కూర్చోవాల్సిన సమయంలోనే అమెరికా ఇలాంటి కఠినమైన సైనిక చర్యలకు పాల్పడటం వల్ల, ఇరాన్ రెండో రౌండ్ చర్చల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఒకవేళ పాక్ మధ్యవర్తిత్వంతో చర్చలు విఫలమైతే.. అది కేవలం రెండు దేశాల మధ్య సమస్యగా మిగలదు. ప్రపంచ క్రూడ్ సరఫరా వ్యవస్థకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటే.. ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. చర్చలకు దూరం కావడం ద్వారా ఇరాన్ తన పంథాను మరింత కఠినతరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సముద్రంలో మొదలైన ఈ తౌస్కా వివాదం.. దౌత్య చర్చల మార్గాలను మూసివేసి పశ్చిమ ఆసియాను మరో భారీ యుద్ధం వైపు నెట్టేలా కనిపిస్తోంది. చూడాలి కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత ఇరాన్, అమెరికా ఎలా రియాక్ట్ అవుతాయనేది.