పల్లి విత్తనాలు దొరుకుతలేవు

పల్లి విత్తనాలు దొరుకుతలేవు

ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి లేబుల్‌‌ వేసి అమ్మకాలు
నాణ్యత పట్టించుకోని సర్కారు
90 % జెర్మినేషన్‌‌ అవసరం
68% ఉన్నవే అంటగడుతున్న
విత్తనాభివృద్ధి సంస్థ

హైదరాబాద్‌‌, వెలుగుయాసంగి సీజన్‌‌లో పల్లి విత్తనాల కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో 76 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ఇంకా 46 వేల క్వింటాళ్ల వరకు కొరత ఉంది. పల్లి విత్తనం వేసేందుకు ఓవైపు అదును దాటిపోతుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాలని చూస్తున్నారు.  కే6 రకం విత్తనాలకు భారీ డిమాండ్‌‌ ఉండడంతో తాజాగా గుజరాత్‌‌ నుంచి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  సీడ్‌‌ బౌల్‌‌ ఆఫ్‌‌ ఇండియా అని గొప్పలు చెప్పుకునే విత్తనాభివృద్ధి సంస్థ పక్క రాష్ట్రాల నుంచి విత్తనాలు తెప్పించుకుని సొంత లేబుల్‌‌ వేసి రైతులకు అమ్ముతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సబ్సిడీతో  రైతులకు విత్తనాలు అందిస్తుంది.

యాసంగి కోసం 76,170 క్వింటాళ్ల పల్లి విత్తనాలు అవసరమని అంచనా వేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ  66,170  క్వింటాళ్లు, జాతీయ విత్తన కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌‌ విత్తనాల ధరను రూ. 9 వేలుగా నిర్ణయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.4 వేలు కాగా, రైతులు మరో రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. 76 వేల క్వింటాళ్లలో ఇప్పటివరకు కేవలం 29,296 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వీటిలో 26,296 క్వింటాళ్లు రైతులకు అమ్మినట్లు వ్యవసాయ శాఖ  లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.   మరో 50 వేల క్వింటాళ్ల అమ్మకాలు జరగాల్సి ఉంది. 35 వేల క్వింటాళ్లు అత్యవసరంగా సిద్ధం చేయాల్సి ఉంది. గుజరాత్‌‌ నుంచి 20 వేల క్వింటాళ్లు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండగా అవి రావడానికి మరో వారం పట్టేలా ఉందని తెలుస్తోంది. మరోవైపు చెలకలు, దుక్కులు దున్ని పల్లి విత్తనాల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.

కొనుగోలులో అక్రమాలు

బహిరంగ మార్కెట్‌‌లో పల్లి విత్తనాల ధర తక్కువ ఉన్నప్పటికీ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం క్వింటాకు రూ.9 వేలకుపైగా  వెచ్చించి 75 వేల క్వింటాళ్లను టెండర్ ప్రక్రియ ద్వారా సేకరిస్తోంది. ఇందులో అధికంగా రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌‌లో వచ్చిన పంట సేకరిస్తుండడంతో పల్లీలు ఎండబెట్టకుండా పచ్చివే సరఫరా చేస్తున్నారు. ఈ విత్తనాలకు జెర్మినేషన్ 90 శాతం పైగా ఉండాల్సి ఉండగా 68 శాతమే ఉన్నట్లు విత్తన ల్యాబ్‌‌లో పరీక్షిస్తే తేలిందని సమాచారం. ఇవే విత్తనాలను రైతులకు విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేస్తోంది. దీంతో విత్తనాలు జెర్మినేషన్‌‌ సామర్థ్యం లేక  మొలకెత్తడం లేదని  రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.