- పార్లమెంట్‌లో చర్చించకుండా కేంద్రం పారిపోతున్నదని విమర్శ
- మోదీ అంటే.. ‘మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా’ అని ఫైర్
- ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో గాయపడ్డవారిని పరామర్శించిన ఎంపీ
న్యూఢిల్లీ, వెలుగు: నీట్ పేపర్ లీక్ వివాదం, అయోధ్య రామ మందిరం కోసం వచ్చిన చందాల్లో అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ లేఖ రాశారు. నీట్ పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పరిపాలనా వైఫల్యాలు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసాయని లేఖలో ప్రస్తావించారు.
పేపర్ లీక్ వ్యవహారంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం దెబ్బతిందన్నారు. ఈ ఘటనపై నామమాత్రపు విచారణ కాకుండా స్పష్టమైన రాజకీయ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రివర్గ జవాబుదారీతనం అనే రాజ్యాంగ సూత్రానికి కట్టుబడి వ్యవహరించాలని ప్రధానిని కోరారు. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి తక్షణమే రాజీనామా కోరాలని లేఖలో పేర్కొన్నారు.
‘చందా చోరీ’పై స్వతంత్ర దర్యాప్తు జరపండి..
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఇచ్చిన విరాళాల్లో అక్రమాలకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలు కోట్ల మంది భక్తులలో తీవ్ర ఆందోళన కలిగించాయని వంశీకృష్ణ అన్నారు. వీటిపై నిష్పాక్షికమైన, పారదర్శకమైన, కాలపరిమితితో స్వతంత్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధానిని కోరారు. నిందితుల హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దోపిడీలో ఏ కేంద్ర మంత్రి లేదా ప్రజా ప్రతినిధి బాధ్యత అయినా నిర్ధారణ అయితే... వారి రాజీనామాతో సహా చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
మోదీ అంటే.. దేశ విధ్వంకారుడు
మోదీ అంటే.. మ్యాన్ ఆఫ్ డెస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా(భారత దేశాన్ని నాశనం చేసే వ్యక్తి) అని ఎంపీ వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించిన తన అసలు ముఖాన్ని దేశ ప్రజలకు చూపారన్నారు. ఈ ఘటనపై పార్లమెంట్ లో చర్చ జరపాలని సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తో పాటు తాము వాయిదా తీర్మానం ఇచ్చినట్లు చెప్పారు.
మంగళవారం పార్లమెంట్ వాయిదా పడిన అనంతరం ఎంపీ మకర ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. నీట్ పేపర్ లీక్, ఇథనాల్ స్కాం, అయోధ్య రామమందిరం ‘చందా చోరీ’పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్నాయన్నారు. అలాగే.. పార్లమెంట్ బయట విద్యార్థులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. కానీ.. పార్లమెంట్ లోపల ప్రతిపక్షాలను, బయట విద్యార్థులను అణిచివేసేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తుందని ఆరోపించారు. అన్నింటినీ దేశ ప్రజలు చూస్తున్నారని, నియంతృత్వ పాలనను ప్రజలు సహించరని హెచ్చరించారు.
గాయపడిన విద్యార్థులకు ఎంపీ పరామర్శ
‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో గాయపడిన బాధితులను ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) హాస్సిటల్‌కు మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల అణచివేత చర్యను తీవ్రంగా ఖండించారు. మహిళలు, పిల్లలు ఉన్నప్పటికీ.. లాఠీచార్జ్ చేయడం, టీయర్‌గ్యాస్ ప్రయోగించడం అత్యంత హేమమైన చర్య అని మండిపడ్డారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూస్తానని, అన్ని విధాలా బాధితులకు అండగా ఉంటానని తెలిపారు.
ప్రధాని ఇంటి ముందు ధర్నా.. అరెస్ట్
ఎన్ని అడ్డంకులు, అణచివేత చర్యలు చేపట్టినా తమను అడ్డుకోలేరని కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నా చేపట్టేందుకు రాహుల్ నిర్వహించిన మార్చ్‌లో తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. వారంతా ఈ మార్చ్‌లో రాహుల్ వెన్నంటే ఉన్నారు. రాహుల్‌తోపాటు ప్రధాని నివాసం వద్దకు చేరుకుని తెలిపారు. చేతులకు బేడీల మాదిరిగా వైర్లను కట్టుకుని ఆందోళన కొనసాగించారు. అనంతరం నేతలతోపాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సిటీ బయటకు తరలించారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘‘నీట్ వైఫల్యాలు, విద్యార్థులపై క్రూరమైన దాడి విషయంలో ఎన్ని చర్యలు చేపట్టినా మమ్మల్ని నిలువరించలేరు. విద్యార్థుల భవిష్యత్, దేశ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. విద్యార్థులపై లాఠీచార్జ్‌ను నిరసిస్తూ.. లోక్‌సభ ప్రతిపక్ష నేతతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ప్రధాని ఇంటి ముందు బైఠాయించాం. మా నోళ్లు నొక్కేలా పోలీసుల బలంతో మమ్మల్నీ అక్కడి నుంచి లాగేశారు. అయినా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా పోరాంటం ఆగదు. ఈ వ్యవహారంలో ప్రజల తరఫున మాట్లాడకుండా మా గొంతును నొక్కలేరు”అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
