కాలానికి తగట్టు ఫుడ్ ఐటమ్స్కు గిరాకీ ఉంటుంది. ఎండాకాలంలో కూల్ డ్రింక్స్, వర్షాకాలంలో వేడి వేడి స్నాక్స్ తినడానికి జనం ఎగబడుతుంటారు. చలికాలంలో చల్లని పదార్థాలను దూరం పెట్టి వేడి వేడి ఫుడ్ ఐటమ్స్ తింటుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. చలికాలంలో వేడివి తింటే కిక్కేముంటుంది. చల్లగా ఓ ఐస్ క్రీం తింటేనే కదా అసలు మజా అంటోంది యూత్.
ఫ్యామిలీతో బయటికి వెళ్లినా, ఫ్రెండ్స్ తో నైట్ రైడ్ చేసినా.. సరదాగా ఒక ఐస్ క్రీం తినడం ఇప్పటి ట్రెండ్. యువత ఫుడ్ క్రేవింగ్స్ కు తగ్గట్టే మార్కెట్లో కూడా వెరైటీ ఐస్ క్రీంలు దొరుకుతున్నాయి. ఒకప్పుడు బటర్ స్కాచ్, వెనిల్లా, స్ట్రాబెర్రీ, లీచీ, చాక్లెట్ ఫ్లేవర్లే మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఐస్ క్రీం పార్లర్లు కొత్త కొత్త ఫ్లేవర్లను పరిచయం చేస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్స్ ను సైతం ఐస్ క్రీం ఫ్లేవర్స్ రూపంలో కస్టమర్లకు అందజేస్తున్నారు.
బ్రౌనీ, చాకో చిప్స్, చాకో లావా, ఓరియో టాపింగ్స్తో చేసినవి బాగా పాపులర్. షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా అందుబాటులో రావడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లొట్టలేసుకొని లాగించేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త బ్రాండ్లు, ఐస్ క్రీం పార్లర్లు పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు వెతికినా దొరకని ఐస్ క్రీం షాపులు, ఇప్పుడు గల్లీకొకటి కనిపిస్తున్నాయి. ఆన్ లైన్ డెలివరీ ఆప్షన్ ఇస్తూ ఇంటికి డెలివరీ చేస్తున్నాయి.
