సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లకు జనం పరుగులు

సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లకు జనం పరుగులు

​ డెంగీ, హెపటైటిస్, ఇన్ఫెక్షన్స్​తో హాస్పిటళ్లకు జనం పరుగులు

హైదరాబాద్, వెలుగు: మాన్సూన్​ స్టార్ట్​కాక ముందే గ్రేటర్ వ్యాప్తంగా సీజనల్​వ్యాధులు పెరుగుతున్నాయి. సిటీలోని హాస్పిటళ్లకు వస్తున్న వారిలో డెంగీ, హెపటైటిస్, ఇన్ఫెక్షన్​కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వాతావరణంలోని మార్పులు, అడపాదడపా కురుస్తున్న వానలే ఇందుకు కారణమని డాక్టర్లు అంటున్నారు. విపరీతమైన జ్వరంతో వచ్చిన వారికి డెంగీ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్లేట్​లెట్స్​కౌంట్​తక్కువగా ఉంటున్న పేషెంట్లను ఉస్మానియాకి రిఫర్​చేస్తున్నట్లు ఫీవర్​హాస్పిటల్​ఆర్‌‌ఎంఓ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు. 

2- 3 వారాలుగా..

పూర్తిస్థాయిలో వానలు మొదలైతే సిటీని సీజనల్ వ్యాధులు చుట్టుముట్టేస్తుంటాయి. సెప్టెంబర్​వరకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ వద్ద డైలీ వందల మంది పేషెంట్లు బారులు తీరి కనిపిస్తుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి ముందే వచ్చింది. వాతావరణంలోని ఆకస్మిక మార్పులే అందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, ఉక్కపోత, 3 గంటల తర్వాత వాతావరణం చల్లబడడం, అంతలోనే వానలతో జనం తట్టుకోలేకపోతున్నారు. వానల కారణంగా దోమలు బెడద పెరుగుతోంది. రెండు, మూడు వారాలుగా సిటీలోని హాస్పిటళ్లలో డెంగీ, ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఈసారి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తుండడంతో సీజనల్​వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

ప్లేట్​లెట్స్​ తగ్గితే..

ప్రస్తుతం సిటీలోని హాస్పిటళ్లకు వస్తున్నవారిలో విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి, పచ్చకామర్లు లక్షణాలు ఉంటున్నాయి. అలాగే రక్త కణాలు పడిపోవడం, ఫుడ్ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రో సమస్యలతో వస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. నిలోఫర్ ఓపీకి వస్తున్న చిన్నారులను ముందుగా డెంగీకి టెస్ట్ కి పంపిస్తున్నారు. గ్యాస్ట్రో ఎంటెరిటిస్ వల్ల కలిగే డయేరియా కేసులు సమ్మర్ సీజన్ నుంచి ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే సమస్య సీరియస్ గా ఉంటే తప్ప హాస్పిటల్​లో చేర్పించాల్సిన అవసరం లేదని పీడియాట్రిషన్  డా.అపర్ణ తెలిపారు. మొన్నటి దాకా ఫీవర్ హాస్పిటల్ కు వస్తున్న ఔట్​పేషెంట్ల సంఖ్య 250గా ఉంటే, ప్రస్తుతం 350 నుంచి 400 ఉంటోందని చంద్రశేఖర్ రెడ్డి ఆర్‌‌ఎంఓ తెలిపారు. వీటిలో డెంగీ, గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు ఉంటున్నాయన్నారు. ఫీవర్ హాస్పిటల్  లో ఇన్‌‌పేషెంట్ విభాగంలో 50 – 60 మంది ఉంటే అందులో దాదాపు 21 డయేరియా కేసులు ఉంటున్నాయి. ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్​కి రిఫర్ చేస్తున్నారు. 

ఓపీలు పెరుగుతున్నాయి

బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాక సీరియస్ కేసులు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. చాలావరకు జనాలు తమ చుట్టుపక్కల ఉన్న దవాఖానలకే వెళ్తున్నారు. కొన్ని రోజులుగా ఓపీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వానలు, పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మొదలైతే ఔట్​పేషెంట్ల సంఖ్య మరింత పెరగొచ్చు.
- చంద్రశేఖర్ రెడ్డి, ఆర్‌‌‌‌ఎంఓ, ఫీవర్ హాస్పిటల్

మొన్నటి దాకా టైఫాయిడ్.. ఇప్పుడు డెంగీ

మొన్నటివరకు టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈసారి సీజనల్​వ్యాధులు ముందే వస్తున్నాయి. కురుస్తున్న వానలతో దోమలు బెడద ఎక్కువైంది. దీంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాలు పెరిగితే కేసులు ఇంకా ఎక్కువవుతాయి. గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ మునుపటితో పోలిస్తే పెరిగాయి. 
- డా.అపర్ణ, పీడియాట్రిషన్

ఫుడ్, వాటర్ వల్ల.. 

వైరల్ జాండీస్, హెపటైటిస్–ఎ, హెపటైటిస్–ఈ, ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రీ మాన్సూన్, మాన్సూన్ సీజన్ లోనే ఈ రకమైన కేసులు వస్తుంటాయి. వాతావరణంలో సడెన్ చేంజస్​తో ఇలా జరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వారం నుంచి వైరల్ హెపటైటిస్ కేసులు వస్తున్నాయి. ఫుడ్ వాటర్ ద్వారా వైరల్ హెపటైటిస్ వ్యాప్తి చెందుతుంది. పచ్చకామర్లు, మైల్డ్ ఫీవర్, వామిటింగ్స్ వచ్చే చాన్స్ ఉంటుంది. గ్యాస్ట్రో డిపార్మెంట్ ఓపీకి 10 కేసులు వస్తే అందులో దాదాపు రెండు వైరల్ హెపటైటిస్, జాండీస్ కేసులు ఉంటున్నాయి.  30 నుంచి 45 ఏండ్ల వాళ్లు ఎక్కువగా వస్తున్నారు. 
- రాహుల్ దుబ్బాక, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్