KKR vs DC: ఢిల్లీ, కోల్‌కతా కీలక మ్యాచ్.. వార్నర్, స్టార్క్ ఆడతారా..?

KKR vs DC: ఢిల్లీ, కోల్‌కతా కీలక మ్యాచ్.. వార్నర్, స్టార్క్ ఆడతారా..?

ఐపీఎల్ లో నేడు రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్ లో ఆడడం అనుమానంగా మారింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ వేలి గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. "వార్నర్‌ గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం పడుతుందని నేను భావిస్తున్నాను. అతనికి చేతి గాయం ఇంకా నయం కాలేదు". అని ఆమ్రే చెప్పాడు. దీంతో నేటి మ్యాచ్ లో వార్నర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కేకేఆర్ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్  పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో చేతి వేలి గాయం కారణంగా దూరమయ్యాడు. 

స్టార్క్ స్థానంలో అవకాశం దక్కించుకున్న చమీర భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రిస్క్ ఎందుకని భావిస్తే స్టార్క్ ఈ మ్యాచ్ లోనూ బెంచ్ కు పరిమితం కాక తప్పదు. కీలక మ్యాచ్ కావడంతో ఈ ఆసీస్ స్టార్లు దూరం కావడం ఆ జట్టుపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఢిల్లీ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఏ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.