ఇథనాల్‌‌ లేకపోతే పెట్రోల్‌‌ ధర రూ.125

ఇథనాల్‌‌ లేకపోతే పెట్రోల్‌‌ ధర రూ.125
  • పార్లమెంట్‌‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఇథనాల్‌‌ బ్లెండింగ్‌‌ (సమ్మేళనం) కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌‌లో కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా వాహనాలు అధిక ఇథనాల్‌‌ మిశ్రమంతో నడుస్తున్నప్పటికీ, దీనివల్ల ఇంజిన్లు దెబ్బతిన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌‌ గడ్కరీ తెలిపారు. ఈ20 పెట్రోల్​వాడకం వల్ల మైలేజీ శాతం 2 నుంచి 6 శాతం మేర తగ్గే అవకాశం ఉందన్నారు.

ఇటీవల పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఇథనాల్‌‌ వినియోగం లేకపోతే.. దేశంలో పెట్రోల్‌‌ ధర లీటరుకు రూ.125 వరకు చేరి ఉండేదని స్పష్టం చేశారు. లోక్‌‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. గత రెండున్నరేండ్లుగా 20 కోట్ల టూ-వీలర్లు, 3 కోట్ల కార్లు ఈ15+, ఈ20 పెట్రోల్‌‌తో ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయని వెల్లడించారు.

ఎఫ్‌‌వై26లో 2.84 కోట్ల వాహనాలకు సర్వీస్‌‌ చేసిన ప్రముఖ ఆటోమొబైల్‌‌ సంస్థ రికార్డుల ప్రకారం ఈ20 వల్ల ఇంజిన్‌‌ డ్యామేజ్‌‌ అయిన దాఖలాలు లేవని చెప్పారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగిసినప్పటికీ, దేశీయంగా ఇథనాల్‌‌ వాడకం వల్ల ఢిల్లీలో లీటరు పెట్రోల్‌‌ రూ.94.77కే లభించిందని తెలిపారు.

అయితే, ఈ10 కోసం తయారైన కొన్ని పాత వాహనాల్లో 2-6 శాతం వరకు మైలేజ్‌‌ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.1.98 లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్య ఆదా కావడంతో పాటు రైతులకు రూ.1.66 లక్ష కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరిందని వెల్లడించింది.