అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు, మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వివరణ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించినందు వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.
ఇటీవలి కాలంలో రెండు వారాల్లోనే వరుసగా నాలుగో విడతగా పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 మేర ధరలు పెరిగిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. దేశ ఆర్థిక స్థిరత్వం, ఎదురవుతున్న సవాళ్లపై సుదీర్ఘంగా మాట్లాడారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో అనవసర భయాందోళనలు సృష్టించడం సరికాదని, "భారతదేశం భయబ్రాంతులకు గురిచేసే ధోరణిని భరించలేదని" ఆర్థిక మంత్రి అన్నారు. కొందరు వ్యక్తులు దేశంలో నెగటివ్ స్టోరీలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ.. భారతీయులు సాధిస్తున్న విజయాలను తక్కువ చేసి చూపడం తగదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అత్యంత స్థితిస్థాపకతతో, సానుకూల వృద్ధి రేటుతో బలంగా ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించి.. మన మాటలు, చేతల ద్వారా వారిలో నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పిలుపునిచ్చారు.
ALSO READ : అంత ఎమోషనల్గా తీసుకోవద్దు..
పశ్చిమాసియా సంక్షోభం మూడు నెలలు పూర్తి కావస్తున్న వేళ భారత్ ప్రస్తుతం ప్రధానంగా ఇంధనం, ఎరువులు, విదేశీ మారక నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మెుత్తానికి ప్రభుత్వానికి వచ్చే లక్ష కోట్ల ఆదాయం పోయినా దేశం అభివృద్ధికి భయాలు అడ్డంకిలా మారకూడదని పిలుపునిచ్చారు.
