ఆఫీసులోనూ పెట్స్‌!

ఆఫీసులోనూ పెట్స్‌!

పెంపుడు జంతువులను ఇష్టపడే వాళ్లు ఎక్కువగా కుక్క, పిల్లిని పెంచుకుంటారు. సాధారణంగా వీటిని ఇంట్లోనే పెంచుకోవాలి. ఆఫీసులకు తీసుకెళ్లడం కుదరదు. ఎందుకంటే వాటికి ‘నోఎంట్రీ’ కాబట్టి. అయితే ఇక మీదట ఆఫీసు ప్రాంగణాల్లోనూ పెంపుడు జంతువులను అనుమతిస్తారట.

‘పెట్ ఫ్రెండ్లీ వర్క్​ ప్లేసెస్’..
ఇదో న్యూ ట్రెండ్. కార్యాలయాల్లో పెంపుడు జంతువులను అనుమతించడమే ఈ ట్రెండ్. ఇటీవలికాలంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటికొన్ని మహానగరాల్లోని ఆఫీసులు పెట్స్​ను తీసుకురావడానికి ఓకే అంటున్నాయి. ఇక్కడ వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. పెంపుడు జంతువుల వల్ల ఎన్నో లాభాలున్నాయనే సంగతి తెలిసిందే.ఎంత ఒత్తిడిలో ఉన్నా రోజులో కొద్ది సేపు వీటితో గడిపితే మానసిక ప్రశాంతత పొందే వారెందరో. అందుకే ఇళ్లల్లో నేకాదు.. ఆఫీసుల్లోనూ ఇవి ఉంటే మంచిదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఉద్యోగుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా కొన్నిసంస్థలు అప్పుడప్పుడు టూర్లు, పార్టీలు ఏర్పాటు చేస్తుంటాయి. కొన్నిసార్లు సైకాలజీ నిపుణులతో కౌన్సిలింగ్, సెమినార్లు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు వాటిలోకి మరో కొత్త ట్రెండ్ వచ్చి చేరింది. అదే ‘పెట్ ఫ్రెండ్లీ వర్క్​ కల్చర్’.

బ్రేక్ టైంలో
వర్క్​ప్లేస్ లో పెంపుడు జంతువుల్ని పెంచుతున్నాయి కొన్ని ఆఫీసులు. అలాగే సిబ్బంది కూడా తమ పెట్స్​ని తెచ్చుకోవచ్చు. వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట ఉంచే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆఫీసులోకీఅనుమతిస్తున్నారు. పెంపుడు జంతువులతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని శాస్త్రీయంగాఎప్పుడో రుజువైంది. ఉద్యోగులు పని మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుంటూ అక్కడి పెట్స్​తో కాసేపు గడుపుతున్నారు.

నైపుణ్యాల పెరుగుదల
పెంపుడు జంతువులతో గడపటం వల్ల‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది విడుదలైన సమయంలో ఎవరితో మాట్లాడినా వాళ్లతో మంచి కమ్యూనికేషన్ పెరుగుతుంది. దీనివల్ల ఆఫీసులో ఉద్యోగుల మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడుతుంది. ఒకవేళ ఆఫీసులోఇతరులతో గడపడం ఇష్టం లేకపోతే హాయిగా పెట్స్​తోనే ఉండొచ్చు.

శారీరక వ్యాయామం
కుక్కలు, పిల్లులు వంటి జంతువులతో గడపడంవల్ల, కలిసి ఆడుకోవడం, పరుగెత్తడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది. దీనివల్ల బద్ధకం పోయి, శరీరం ఫిట్ గా ఉంటుంది. ఇదిగుండె జబ్బులు రాకుండా కూడా నివారిస్తుందని‘ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ పరిశోధనలో తేలింది. ఇంట్లో పెంపుడు జంతువుల్నిపెంచుకోలేని వాళ్లకు ‘పెట్ ఫ్రెండ్లీ వర్క్​  ప్లేసెస్’మంచి అవకాశం. ఇక్కడైనా కాసేపు వాటితోగడపొచ్చు.