
తెలంగాణకు ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపద మన సొంతం. అటువంటి చారిత్రక సంపద ఫోటోల రూపంలో హైద్రాబాద్ రవీంద్రభారతిలో కొలువు దీరింది. అన్ టోల్డ్ తెలంగాణ అంటూ ప్రజలకు తెలియని చారిత్రక విశేషాలను ఫోటోల రూపంలో తీసుకొచ్చాడు ఓ యువ చిత్రకారుడు.
రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ చారిత్రిక సంపద ఫొటో ఎగ్జిబిషన్ రూపంలో కొలువుదీరింది. ద అన్ టోల్డ్ తెలంగాణ అంటూ తెలంగాణ యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య మరుగున పడిన మన చరిత్రను ఫొటోల రూపంలో బంధించి ప్రదర్శిస్తున్నాడు. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో పురాతన ఆనవాళ్లను తెలంగాణ అంతటా తిరిగి సంపాదించి ప్రదర్శన రూపంలో పట్నానికి తీసుకొచ్చాడు. రవీంద్ర భారతి ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీ లో ఈ నెల రెండవ తేదీన ప్రారంభమైన ఫోటో ఎగ్జిబిషన్ కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ ఫోటో ఎగ్జిబిషన్ నడుస్తోంది.
ఈ ఫోటో ప్రదర్శనలో ఎన్నో చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అల్వాన్ పల్లిలోని గొల్లత్తగుడి ఒకటి. ఈ చారిత్రక కట్టడాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. గొల్లత్త గుడి సమీపంలో అతిపెద్ద పాదాలున్నాయి. ఆరడుగుల పొడవున్న ఈ పాదాలు జైన మహావీరునికి సంబంధించినవిగా భావిస్తున్నారు. వరంగల్ సమీపంలోని వీర శైవ బలిపీఠం సందర్శకులను ఆకట్టుకుంటోంది. వీరశైవం ప్రబలంగా ఉన్న కాలంలో శివైక్యం చెందాలని కోరుకునే వారు స్వచ్ఛందంగా తమ తలని ఈ పీఠం దగ్గర నరుక్కునేవారట. ఈ బలిపీఠం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఏకవీరా దేవి ఆలయం ఎదురుగా ఉన్న పెద్ద రాతిగుండు మూడు గుహలుగా చెక్కబడి ఉంది. దట్టమైన అడవిలో పచ్చని చెట్ల నడుమ పెద్దకొండను తొలిచి గుహగా మలిచారు. ఈ గుహలో ఏకశిల శివలింగం, పక్కనే మరో మూడు గుహలున్నాయి. అడవి సోమనపల్లి గుహాలయాలని పిలిచే ఈ గుహలు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో ఉన్నాయి. దేశ శిల్పచరిత్రలోనే విశిష్టమైన శిల్పకళ దేవుడి గుట్ట సొంతం. భూపాలపల్లి జిల్లాలోని కొత్తూరు అడవుల్లో ఈ దేవుడిగుట్ట ఉంది. తెలంగాణ చారిత్రక సంపద ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యమంటున్నాడు యువ చిత్రకారుడు అరవింద్.
హన్మకొండలో బస్టాప్లో దిగగానే 16వ జైన తీర్థంకరుడైన శాంతినాథుని 30 అడుగుల విగ్రహం దర్శనం ఇస్తుంది. హన్మకొండలో ప్రసిద్ధి చెందిన పద్మాక్షి అమ్మవారి ఆలయ సమీపంలో అగ్గలయ్య గుట్ట మీద ఈ విగ్రహం ఉంది. హైహీల్స్ వేసుకొని, ఆయుధం ఎక్కుపెట్టిన చక్రవర్తి మాదిరిగా ఈ విగ్రహం ఉంటుంది. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ఉండవల్లి గుహాలయాలు, మానేరు నది సమీపంలోని సోమనపల్లి గుహాలయాలు, ఆత్మకూరులో 300 గదులతో నిర్మించిన గడి, భూపాలపల్లి జిల్లాలో 7, 8వ శతాబ్దాల కాలం నాటి పాండవుల గుట్టపై గొంతెమ్మ గుహ లాంటి ఎన్నో చారిత్రక శిలలు, విగ్రహాలను ఫొటోల రూపంలో ప్రదర్శనలో ఉంచాడు అరవింద్.
తెలంగాణలో అనేక చారిత్రక కట్టడాలు మరుగున పడిపోయాయంటున్నాడు ఈ యువ చిత్రకారుడు. వాటన్నింటినీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందంటున్నాడు. తెలంగాణ చారిత్రక నేపధ్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నదే తన సంకల్పమని చెబుతున్నాడు.