‘కన్నప్ప’, ‘కుబేర’ సినిమాలు పైరసీ చేసి.. హెచ్డీ వెర్షన్స్ అప్ లోడ్ చేసి దొరికిపోయాడు !

‘కన్నప్ప’, ‘కుబేర’ సినిమాలు పైరసీ చేసి.. హెచ్డీ వెర్షన్స్ అప్ లోడ్ చేసి దొరికిపోయాడు !

హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు చేశారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు 3 వేల 700 కోట్ల నష్టం అని TFCC సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైరసీకి పాల్పడుతున్న జన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉంటూ సినిమాలను పైరసీ చేస్తున్న AP తూర్పు గోదావరికి చెందిన జన కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సినిమా విడుదల అయిన రోజే HD వెర్షన్ను పైరసీ చేసి కిరణ్ కుమార్ ఆన్లైన్లో అప్లోడ్ చేసి డబ్బులు దండుకుంటున్నాడు. ‘గేమ్ ఛేంజర్’, ‘తండేల్’, ‘కన్నప్ప’, ‘కుబేర’ సినిమాల హెచ్డీ వెర్షన్స్ విడుదలైన రోజు, విడుదలైన రెండో రోజు, మూడో రోజే పైరసీ సైట్లలో అందుబాటులోకి రావడానికి కారణం కిరణ్ కుమార్ అని పోలీసులు గుర్తించారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( TFCC) యాంటీ వీడియో పైరసీ సెల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కిరణ్పై కేసు నమోదు చేశారు. 2024 సంవత్సరంలో సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల 3వేల 700 కోట్ల రూపాయల నష్టం జరిగిందని TFCC (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ) ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై 1957 కాపీ రైట్ యాక్ట్.. ఐటీ యాక్ట్లతో పాటు పలు సెక్షన్ల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు జన కిరణ్ కుమార్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. 

విడుదలైన తొలి రోజు, రెండో రోజుకే హెచ్ డీ వెర్షన్ సినిమాలు పైరసీ సైట్లలో అందుబాటులోకి వస్తుండటంతో కొందరు థియేటర్ల ముఖం చూడటమే మానేశారు. థియేటర్కు వెళ్లి చూడకపోయినా ఓటీటీలో ఆ సినిమా విడుదలయ్యేంత వరకూ కూడా కొందరు ఆగడం లేదు. పైరసీ సైట్లలో హెచ్డీ వెర్షన్ సినిమాలు చూస్తుండటంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న సినిమాలు ఘోరంగా నష్టపోతున్నాయి.