కరోనా వేళ పేదలకు మోడీ భరోసా..కేంద్రం భారీ ప్యాకేజీ

కరోనా వేళ పేదలకు మోడీ భరోసా..కేంద్రం భారీ ప్యాకేజీ

కరోనాతో విధించిన లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదల కోసం కేంద్రం ప్రకటించిన గరీబ్ ​కల్యాణ్​ యోజన వారికి పెద్ద దిక్కు కానుంది. ఈ స్కీం కింద మన రాష్ట్రంలో సుమారు 3 కోట్ల మందికి బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయనున్నారు. అలాగే మహిళల జన్​ధన్​ ఖాతాల్లో రూ. 500 చొప్పున క్యాష్​ వేయనున్నారు.

మొత్తంగా చూస్తే గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా కేంద్రం తీసుకున్న 11 ముఖ్యమైన నిర్ణయాల్లో దాదాపుగా అన్ని పథకాల ఫలాలు ఒక్కటొక్కటిగా అమలవుతున్నాయి. కేంద్రం ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీలో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన దాదాపు 99 శాతం కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. కేంద్రం నిర్ణయాల్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అయితే కేంద్రం కల్పిస్తున్న సబ్సిడీలు, వెసులుబాట్లను తన ఖాతాలోకి వేసుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు కాకుండా, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి కుటుంబాన్నీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అంటున్నారు.

వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సాయం

రూ.3 వేల కోట్లను కేటాయించి వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కేంద్రం తోడుగా నిలిచింది. ఈ పథకంలో భాగంగా మూడు కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.వెయ్యి చొప్పున పెన్షన్ ను 3 నెలల పాటు కేంద్రం అందించనుంది. దీనివల్ల రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పొందుతున్న 30 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరే అవకాశముంది.

ఉపాధి కూలీ పెంపు

ఉపాధి హామీ కార్మికులకు రోజూవారి కూలీని రూ.182 నుంచి రూ.202కు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో జాబు కార్డులున్న ఐదు కోట్ల మంది ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరగా.. రాష్ట్రంలో 59 లక్షల మందికి మేలు జరగనుంది. ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.4,431 కోట్లను విడుదల చేసింది. త్వరలో ఉపాధి కూలీలకు ఈ డబ్బులు అందనున్నాయి.

ఎంప్లాయిస్ కు మద్దతు

వంద లోపు ఉద్యోగులున్న కంపెనీల్లో రూ.15 వేల కంటే తక్కువ జీతం ఉన్నవారికి రాబోయే 3 నెలల పాటు ఈపీఎఫ్ ఎంప్లాయర్, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ను కేంద్రమే చెల్లిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో సంఘటిత రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం కేంద్రం రూ.ఐదు వేల కోట్లను భరించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వారి అమౌంట్ లో 75 శాతం బ్యాలెన్స్ ను కానీ.. 3 నెలల వేతనాలను కానీ.. రెండిట్లో ఏది తక్కువైతే అది విత్ డ్రా చేసుకునేందుకు వీలుగా చట్టాన్ని సవరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 4 కోట్ల 80 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది.

భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ నిధి

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.1,200 కోట్లు ఖర్చుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్​తో  కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సాంత్వన చేకూర్చేందుకు రాష్ట్రాల భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ లో ఉన్న రూ.31వేల కోట్ల నిధిని వాడుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో రాష్ట్రంలోని కార్మికుల్లో ఒకింత ఆందోళన కనపడుతోంది.

జిల్లా ఖనిజ నిధి

కోవిడ్​–19 వ్యాప్తిని నివారించడం, రోగుల చికిత్సకు సంబంధించి మెడికల్​ టెస్టులు, స్క్రీనింగ్, ఇతర సౌకర్యాలను కల్పించడానికి జిల్లా ఖనిజ నిధి(డీఎంఎఫ్) ని ఉపయోగించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది. మన రాష్ట్రంలో సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ మినరల్ ఫండ్, అలాగే సింగరేణి లాంటి బొగ్గు గనులు, ఇతర గని కార్మికుల కోసం నిధులు ఉంటాయి. వీటిని వాడుకునేలా కేంద్రం అవకాశం ఇచ్చింది.

అమెరికాలో 7 వేలు దాటిన కరోనా మరణాలు