- ఇప్పటికే 1.20 కోట్ల కుటుంబాల ఇండ్ల జాబితా పూర్తి
- ‘మన్ కీ బాత్’ 133 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా జన గణన ప్రక్రియలో దాదాపు కోటి 20 లక్షల కుటుంబాల ఇండ్ల జాబితా పూర్తయిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తయిన రాష్ట్రాల్లో జనగణన సిబ్బంది కుటుంబాల గణనను ప్రారంభించినట్టు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 133వ ఎపిసోడ్ లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా అణుశక్తి, దేశ సంస్కృతి, సాంప్రదాయ రుచులు, గణిత ఒలింపియాడ్, జన గణన అంశాలపై మాట్లాడారు.
‘‘ఈసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రత్యేకమైంది. గతంలో ఈ ప్రక్రియలో పాల్గొన్న వారికి ఇది భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. 2027 జనాభా గణనను డిజిటల్ రూపంలోకి మార్చాం. మొత్తం సమాచారం నేరుగా డిజిటల్ రూపంలోనే నమోదు అవుతుంది. ఇంటింటికీ వెళ్లే ఎన్యూమరేటర్స్ వద్ద ఒక మొబైల్ యాప్ ఉంటుంది..వారు మీతో మాట్లాడి సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తారు” అని వివరించారు.
జాతీయ జనాభా లెక్కలు కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ప్రజలందరి బాధ్యత, భాగస్వామ్యం అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ప్రజలు అందించే ఈ సమాచారం పూర్తిగా భద్రంగా, గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అందువల్ల ప్రజలందరూ ఈ ప్రక్రియలో పాల్గొని, 2027 జనాభా లెక్కలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
- అణు రంగంలో అద్భుతం..కల్పక్కం రియాక్టర్
తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ విజయవంతంగా ‘క్రిటికాలిటీ’ దశకు చేరుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ దీర్ఘకాలిక అణువ్యూహంలో మూలస్తంభమని, కేవలం విద్యుత్తునే కాకుండా, భవిష్యత్తు కోసం ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేస్తుందని, తద్వారా పారిశ్రామిక, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
పౌర అణు కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు మరింత ముందుకు తీసుకువెళ్తున్నారని, వారి కృషి దేశ నిర్మాణానికి గణనీయమైన తోడ్పాటు అందిస్తున్నదని ప్రశంసించారు. భారత్ పవన విద్యుత్ సామర్థ్యం 56 గిగావాట్లకు చేరిందని, గత ఏడాదిలోనే 6 గిగావాట్ల కొత్త సామర్థ్యం తోడైందని మోదీ తెలిపారు. పవన శక్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని వెల్లడించారు. గుజరాత్‌లోని కచ్, పటాన్‌లాంటి ప్రాంతాల్లో భారీ రెన్యువెబుల్ పార్కులు వెలుస్తున్నాయని, ఇది యువతకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు.
- పండుగలా వెదురు పరిశ్రమ..
ఒకప్పుడు వెదురును బ్రిటిష్ చట్టాల ప్రకారం ‘చెట్టు’గా పరిగణించేవారని, తాము 2017లో ఆ చట్టాన్ని మార్చడం వల్ల నేడు ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు పరిశ్రమ పండుగలా సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. త్రిపురలోని బిజయ్ సూత్రధర్, ప్రదీప్ చక్రవర్తిలాంటి వారు టెక్నాలజీని జోడించి అద్భుతమైన వెదురు ఉత్పత్తులను తయారు చేస్తున్నారని ప్రశంసించారు. సిక్కిం, నాగాలాండ్, మిజోరంలలో వెదురు ఫర్నీచర్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆహార ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్‌కు చేరుతున్నాయని చెప్పారు.
20 కోట్లకు పైగా చారిత్రక పత్రాలను డిజిటలైజ్ చేశామని, ఇందులో రాణి లక్ష్మీబాయి ఉత్తరాలు, నేతాజీ ప్రసంగాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. www.abhilekh-patal.in వెబ్‌సైట్ ద్వారా వీటిని చూడవచ్చని సూచించారు. ఫ్రాన్స్‌లో జరిగిన గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ పోటీల్లో భారతీయ యువతులు 6వ ర్యాంక్ సాధించడంపై ప్రధాని గర్వపడ్డారు. గోల్డ్ మెడల్ సాధించిన శ్రేయ ముంధ్రా, సిల్వర్ సాధించిన సంజన, బ్రాంజ్ సాధించిన శివానీని ప్రత్యేకంగా అభినందించారు. బ్రెజిల్‌లో జరిగిన పోటీల్లో భారతీయ చీజ్ బ్రాండ్లు అవార్డులు సాధించాయని ప్రధాని తెలిపారు.

