- మాదాపూర్, సికింద్రాబాద్ ఏరియాల్లో ‘నో ఫ్లయింగ్ జోన్’
గచ్చిబౌలి/ పద్మారావునగర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటించే ఐటీ కారిడార్‌తో పాటు బహిరంగ సభ జరగనున్న సికింద్రాబాద్ పరిసరాల్లో అధికారులు భారీగా ఆంక్షలు విధించారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హైటెక్ సిటీలోని సింధూ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిమితుల్లో ‘నో ఫ్లయింగ్ జోన్’ విధిస్తూ సీపీ డాక్టర్ రమేశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బేగంపేట, బోయిన్పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా డ్రోన్లు, పారాగ్లైడర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు మల్కాజిగిరి డీసీపీ వెల్లడించారు.
24 గంటల పాటు ఆంక్షలు
ఈ నిషేధాజ్ఞలు మే 10న అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రధాని రాక దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండే అవకాశం ఉంది.
