Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద‘ఎయిర్ షో’ను ప్రారంభించిన మోడీ

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద‘ఎయిర్ షో’ను ప్రారంభించిన మోడీ

బెంగళూరు : ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన మొదలైంది. బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ కేంద్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విమానాల విన్యాసాలను మోడీ తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పాల్గొన్నారు.

సందర్శకులకు అవకాశం 

రక్షణ శాఖ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి  ఏరో ఇండియాను ఆర్భాటంగా నిర్వహిస్తోంది. కరోనా కారణంతో 2021లో జరిగిన గత వైమానిక ప్రదర్శనలో సందర్శకులకు అవకాశం కల్పించలేదు. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో రిహార్సల్స్‌కు సైతం భారీగా జనం వచ్చారు. ఈనెల 16, 17 తేదీల్లో  ప్రదర్శనను సాధారణ ప్రజలు కూడా సందర్శించవచ్చు. 
ఈ ఐదు రోజులూ సమావేశాలు, విమానాల కొనుగోలు ఒప్పందాలు   జరుగనున్నాయి. సందర్శకుల కోసం ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. నగరం నలుమూలల నంచి యలహంకకు బీఎంటీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.

భారత్ ఆత్మవిశ్వాసానికి ప్రతీక : మోడీ

ఏరో ఇండియా ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘నవ భారత సామర్థ్యాలను చాటి చెప్పేందుకు బెంగళూరు గగనతలం వేదికైంది. ఏరో ఇండియా మన బలాన్ని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు.. మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతోంది. ఇప్పుడు విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు భారత్ కేవలం మార్కెట్‌ మాత్రమే కాదు.. ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్‌ ముందడుగు వేస్తోంది’ అని ప్రధాని మోడీ చెప్పారు. 

రూ.75వేల కోట్ల ఒప్పందాలు

‘ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్‌, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్లడించారు.

వాయుసేనాధిపతి ‘గురుకుల్‌’ ప్రదర్శన

ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ పాల్గొన్నారు. స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి ‘గురుకుల్‌’ విన్యాసానికి నాయకత్వం వహించారు.

పకడ్బందీ ఏర్పాట్లు

2019 ఏరో ఇండియాలో రెండు సూర్యకిరణ్‌ విమానాలు ఆకాశంలో ఢీకొట్టుకుని కూలిపోగా పైలట్లు గాయపడ్డారు. మరుసటిరోజు పార్కింగ్‌ ప్రదేశంలో మంటలు చెలరేగి వందకు పైగా కార్లు బూడిదగా మారాయి. ఈసారి అటువంటి విపత్తులు సంభవించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.