ఆదివాసీల కష్టసుఖాలు నాకు తెలుసు

ఆదివాసీల కష్టసుఖాలు నాకు తెలుసు
  • బిర్సా ముండా స్మారక మ్యూజియం ప్రారంభించిన మోడీ

రాంచీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చొరవతోనే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాజ్‌పేయి వల్లే గిరిజన వ్యవహారాల ప్రత్యేక శాఖ ఏర్పడిందని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాకు గుర్తుగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆయన స్మారక మూజ్యియాన్ని ఏర్పాటు చేశారు. బిర్సా జయంతి సందర్భంగా ఈ రోజు ఆ మ్యూజియాన్ని ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. బిర్సా ముండాకు నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. గిరిజనుల హక్కులను కాపాడడం కోసం ఆయన నిరంతరం పోరాటం సాగించారని,  అలాగే వాళ్లను సైతం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా ప్రోత్సహించారని అన్నారు. తన జీవితంలో చాలా వరకూ గిరిజన సోదరులతోనే గడిపానని, వాళ్ల జీవితంలో కష్టసుఖాలు ఎలా ఉంటాయో స్వయంగా చూశానని ప్రధాని మోడీ చెప్పారు. ఆదివాసీల రోజువారీ జీవితం, అవసరాలు ఎలా ఉంటాయో తెలిసిన తనకు ఈ రోజు చాలా ఎమోషనల్ డే అని మోడీ అన్నారు. కాగా, బిర్సా ముండా గౌరవార్థం ఆయన జయంతిని  జన్‌జాతీయ గౌరవ దివస్‌గా పాటించాలని ప్రభుత్వం ప్రకటించింది.