V6 News

భార్యతో గొడవ.. పెళ్లైన నాలుగు నెలలకే .. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మేనేజర్ ఆత్మహత్య

భార్యతో గొడవ.. పెళ్లైన నాలుగు నెలలకే .. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మేనేజర్ ఆత్మహత్య

ఒక చిన్నపాటి గొడవకు వైవాహిక జీవితంలో విషాదాన్ని నింపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు  ఫోన్ కాల్‌లో భార్యతో  జరిగిన చిన్న గొడవ కారణంగా ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు హర్యానాలోని గురుగ్రామ్‌లో కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే.??  ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 33 ఏళ్ల రిషబ్ దీక్షిత్, గురుగ్రామ్ సెక్టార్ 76లోని పిరమిడ్ సొసైటీలో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితమే సోనమ్ గుప్తా అనే యువతిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. సోనమ్ ముంబైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, రిషబ్ గురుగ్రామ్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 16న రాత్రి భార్యాభర్తలిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్న సమయంలో వివాదం మొదలైంది. తనతో పాటే ఉండాలని గురుగ్రామ్ వచ్చేయాలని రిషబ్ పదేపదే సోనమ్‌ను కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రిషబ్ ఫోన్ కట్ చేశాడు. సోనమ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా రిషబ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆందోళన చెందిన ఆమె వెంటనే ముంబై నుండి గురుగ్రామ్‌కు బయలుదేరింది.

ఏప్రిల్ 17న ఉదయం సోనమ్ తన భర్త ఫ్లాట్‌కు చేరుకునేసరికి తలుపు లోపలి నుండి తాళం వేసి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో సెక్యూరిటీ సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రిషబ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. కేవలం నాలుగు నెలల క్రితమే ఒక్కటైన ఈ జంట జీవితంలో ఇలాంటి విషాదం నెలకొనడం స్థానికులను కలిచివేసింది.

సోనమ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం.