జవాన్.. కిసాన్ చేతుల్లో దేశం సురక్షితం: మోడీ

జవాన్.. కిసాన్ చేతుల్లో దేశం సురక్షితం: మోడీ
  • పేదరికాన్ని కాంగ్రెస్ ఓట్ల కోసమే వాడుకుంది
  • వాళ్లకి ఫొటోలకు పోజులివ్వడమే తెలుసు

గాంధీనగర్: జవాన్, కిసాన్ చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. జవాన్లు సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశాన్ని రక్షిస్తుంటే.. రైతులు దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. గుజరాత్ లో పర్యటిస్తున్న ఆయన.. గాంధీనగర్ లో ప్రధానమంత్రి శ్రమ యోగి మానధన్ (పీఎం-ఎస్ వైఎం) పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను ఆయన అందించారు. దాదాపు 42 కోట్ల రైతులు, పని మనుషులు, అసంఘటిత కార్మికులకు ఈ పథకం మేలు చేస్తుందన్నారు. నెలనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకు చెల్లించడం ద్వారా 60ఏళ్లు వయసు దాటాక రూ.3 వేల పెన్షన్ అందుకోవచ్చన్నారు.

రాహుల్ పై ఫైర్

రైతులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని మోడీ అన్నారు. అసలు పేదరికమనేదే లేదని, అదో మానసిక స్థితి అని వాళ్ల భావన అంటూ 2013 గుజరాత్ ఎన్నికల సందర్భంగా  రాహుల్ చేసిన కామెంట్స్ ను ప్రస్తావిస్తూ మోడీ ధ్వజమెత్తారారు. ఈ నాయకులకు పేదరికమంటే ఏం తెలుసని ప్రశ్నించారాయన. తిండి లేక కడుపు మాడ్చుకుని నిద్ర పోయేవాళ్ల స్థితి.. రాహుల్ లాంటి నేతలకు తెలియదన్నారు. పేదరికమంటే వాళ్ల దృష్టిలో ఫొటోలకు పోజులిచ్చేందుకు పనికొచ్చేదని అన్నారు.

55 ఏళ్లలో చేయలేనిది.. చాయ్ వాలా 55 నెలల్లో చేశాడు

కాంగ్రెస్ ప్రభుత్వంలో గరీబీ హఠావో అంటూ నినాదాలిచ్చారే కానీ, పేదలను మాత్రం దేవుడి దయకు వదిలేశారని ఆరోపించారు. అటువంటి వారిని ఆదుకునేందుకు పీఎం ఎస్ వైఎం పథకం తెచ్చామన్నారు. వాళ్లు 55ఏళ్ల దేశాన్ని పాలించి.. పేదరికాన్ని కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని చెప్పారు. వారు 55 ఏళ్లలో చేయలేని పనిని.. చాయ్ వాలా 55 నెలల్లో చేశాడని మోడీ అన్నారు.

అంతకు ముందు గాంధీనగర్ జిల్లాలోని అన్నపూర్ణ ధామ్ ఆలయాన్ని మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, సైనికుల చేతిలో మన దేశం సురక్షితంగా ఉందన్నారు. అన్నదాతలు దేశానికి తిండి పెడుతున్నారని, జవాన్లు దేశాన్ని రక్షణగా నిలుస్తున్నారని అన్నారు.