కేంద్ర కేబినెట్​లో  మార్పులు!

కేంద్ర కేబినెట్​లో  మార్పులు!
  • ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నేపథ్యంలో పార్టీ పర్ఫార్మెన్స్, 
  • మినిస్టర్ల పనితీరుపై రివ్యూ 
  • మోడీతో అమిత్ షా, నడ్డా భేటీ
  • కేంద్ర మంత్రులతో వరుస మీటింగ్స్

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. పలువురు కేంద్ర మంత్రులతో కూడా ప్రధాని వరుసగా మీటింగ్​లు నిర్వహించారు. దీంతో కేంద్ర కేబినెట్​లో త్వరలోనే మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు రావడం.. వచ్చే ఏడాది మొదట్లోనే ఐదు రాష్టాల ఎన్నికలు జరగనుండటంతో.. పార్టీ, మంత్రుల పనితీరుపై రివ్యూ కోసమే ప్రధాని మోడీ, షా, నడ్డా కలిసి వరుస మీటింగ్​లు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, బీజేపీ ప్రభుత్వాల పనితీరుపైనా రివ్యూ జరిగినట్లు తెలిపాయి. పార్టీ జనరల్ సెక్రటరీలతో ప్రత్యేకంగా సమావేశమైన నడ్డా.. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పనితీరు, కరోనా రిలీఫ్​కార్యక్రమాల్లో బీజేపీ క్యాడర్ చేసిన సేవలపై కూడా రివ్యూ చేశారు. వచ్చే ఏడాది పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పంజాబ్ తప్ప మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలో 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీ ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ను పూర్తిగా కేంద్రం పరిధిలోకే తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రధాని ప్రకటించారు. త్వరలో ఓ కీలక సోషల్ సెక్యూరిటీ స్కీంను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. 

మీటింగ్స్ కు హాజరైంది వీరే.. 

ప్రధాని నివాసంలో మూడు విడతలుగా కేంద్ర మంత్రులతో రివ్యూ మీటింగ్స్ జరిగాయని పార్టీ వర్గాలు చెప్పాయి. సుదీర్ఘంగా జరిగిన ఒక్కో మీటింగ్ లో కొందరు మంత్రులు ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. అగ్రికల్చర్, రూరల్, అర్బన్ డెవలప్ మెంట్, పశు సంవర్ధక, మత్స్య, గిరిజన వ్యవహారాలు, కల్చర్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్, సివిల్ ఏవియేషన్, రైల్వేస్, ఫుడ్ అండ్ కన్జూమర్ అఫైర్స్, జల శక్తి, పెట్రోలియం, స్టీల్, ఎన్విరాన్ మెంట్ శాఖల మంత్రులు, డిప్యూటీ మినిస్టర్లు ఈ మీటింగ్ లకు హాజరయ్యారని పార్టీ నేతలు వెల్లడించారు. కీలకమైన మినిస్ట్రీల పనితీరు, కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర మంత్రుల పని తీరుపైనే ప్రధానంగా టాప్ త్రీ లీడర్లు ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.