- ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
- తొలి ట్రైన్ గువాహటి- కోల్‌కతా (హౌరా) మధ్య నడుస్తుందని వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివరిలో జెండా ఊపి ప్రారంభించనున్నారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ప్రకటించారు. టెస్టింగ్, సర్టిఫికేషన్ పూర్తయ్యాయని, మొదటి రూటు గువాహటి-, కోల్‌కతా (హౌరా) మధ్య ఉంటుందని చెప్పారు. ప్రారంభ తేదీ నుంచి 20 రోజుల్లో రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు.
16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మొత్తం 823 ప్రయాణికులు ప్రయాణించవచ్చని చెప్పారు. దీనిలో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు (611 బెర్త్‌లు), నాలుగు సెకండ్ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్ ఏసీ కోచ్ (24 బెర్త్‌లు) ఉంటాయన్నారు. ఈ ట్రైన్ స్పీడ్ కెపాసిటీ గంటకు 180 కి.మీ. వరకు ఉందని, కానీ గువాహటి-– కోల్‌కతా మధ్య 120-–130 కి.మీ. స్పీడ్ తో నడుస్తుందన్నారు.
ఈ ట్రైన్‌లో థర్డ్ ఏసీ సీటు ధర సుమారు రూ.2,300, సెకండ్ ఏసీలో అయితే రూ.3 వేలు, ఫస్ట్ ఏసీ అయితే రూ.3,600 ఉండే అవకాశం ఉంది. ఇదే రూటులో ఫ్లైట్ టికెట్ ధర రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుందని తెలిపారు. మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ధరలు నిర్ణయించినట్టు చెప్పారు.
గువాహటి నుంచి బయలుదేరే ట్రైన్‌లో అస్సామీ వంటకాలు, కోల్‌కతా నుంచి బయలుదేరే ట్రైన్‌లో బెంగాలీ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో 8 ట్రైన్‌లు సిద్ధమవుతాయని, ఈ ఏడాది చివరికి 12 ట్రైన్‌లు పట్టాలెక్కనున్నాయని తెలిపారు.
వందే భారత్ స్లీపర్ ఫీచర్లు ఇవే..
- క్వాలిటీ డిజైన్ బెర్త్‌లు, మంచి కుషనింగ్
- ఆటోమేటిక్ డోర్లు, బోగీ మధ్య కుదుపు లేని భాగం
- సుపీరియర్ సస్పెన్షన్, నాయిస్ రిడక్షన్
- కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్
- ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్
