కరోనాపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన కేంద్రం

కరోనాపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన కేంద్రం
  •     హోమ్ క్వారెంటైన్​పై  కేంద్ర ఆరోగ్యశాఖ గైడ్​లైన్స్​
  •     ట్విట్టర్​లో షేర్ చేసిన ప్రధాని మోడీ

కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్​లైన్స్ రిలీజ్ చేసింది. హోమ్ క్వారెంటైన్​లో ఎలా ఉండాలనే దానిపై పలు సూచనలు చేసింది. వీటిని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ట్విట్టర్​లో షేర్ చేశారు. ‘‘కొంత ముఖ్యమైన సమాచారం ఇక్కడుంది. తప్పకుండా చదవండి” అని ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘మిమ్మల్ని, మీరు ప్రేమించే వ్యక్తులను కాపాడుకోవడమే హోమ్ క్వారెంటైన్” అని హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. కరోనా వైరస్ లక్షణాలుంటే లేదా కరోనా సోకిన దేశాల నుంచి వచ్చినా హోమ్ క్వారెంటైన్​లో ఉండాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.

  • హోమ్ క్వారెంటైన్​లో ఉండేవారు మంచి వెలుతురుండే సింగిల్ రూమ్​లో సెపరేట్​గా ఉండాలి. దానికి అటాచ్డ్ బాత్ రూమ్ లేదా సెపరేట్ టాయ్ లెట్ ఉంటే బెటర్.
  • ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అదే గదిలో ఉండాల్సి వస్తే ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి. కనీసం ఒక మీటర్ దూరం మెయింటెయిన్ చేయాలి.
  • క్వారెంటైన్​లో ఉండే వ్యక్తి వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు దూరంగా ఉండాలి. అలాగే ఏవైనా వ్యాధులతో బాధపడే వారికి దగ్గరగా వెళ్లకూడదు. ఎందుకంటే వారి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండి వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.
  • తనకు కేటాయించిన గదిలోనే ఉండాలి. ఇంట్లో అటూఇటూ తిరగకూడదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిళ్లు, బర్త్​ డే లాంటి ఫంక్షన్లకు హాజరు కావొద్దు.
  • తరచూ శానిటైజర్​తో చేతులు కడుక్కోవాలి.
  • ఇంట్లో వారు ఉపయోగించే వస్తువులు గిన్నెలు, గ్లాసులు, టవల్ లాంటివి తాకకూడదు. ఇవన్నీ తనకు సెపరేట్​గా ఉంచుకోవాలి.
  • తప్పనిసరిగా అన్ని వేళల్లోనూ సర్జికల్ మాస్క్ ను వినియోగించాలి. ప్రతి 6–8 గంటలకు మాస్క్​ను మార్చాలి.  డిస్పోజబుల్ మాస్క్​లను తిరిగి వాడకూడదు.
  • యూజ్ చేసిన మాస్క్​కు వైరస్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆర్డినరీ బ్లీచింగ్ సొల్యూషన్ (5 %) లేదా హైపోక్లోరైట్ సొల్యూషన్ (1%)తో శుభ్రపరచాలి. లేని పక్షంలో కాల్చేయడం లేదా పూడ్చివేయాలి.
  • కరోనా లక్షణాలుంటే వెంటనే దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు సమాచారమివ్వాలి. లేదంటే 011–23978046 నెంబర్​కు ఫోన్​ చేయాలి.
  • కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...
  • హోమ్ క్వారెంటైన్​లో ఉండే వ్యక్తి బాధ్యతలను ఎవరో ఒకరో ఫ్యామిలీ మెంబర్ చూసుకోవాలి.
  • ఆ వ్యక్తి ఉండే రూమ్, వేసుకునే బట్టలను ప్రతిరోజూ క్లీన్ చేయాలి. దీనికి సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ ను వినియోగించాలి. బాత్ రూమ్​ను బ్లీచింగ్​తో కడగాలి.
  • ఆ వ్యక్తితో డైరెక్ట్ కాంటాక్ట్​లో ఉండకూడదు. వారుండే గది/ వాళ్ల బట్టలను క్లీన్ చేసేటప్పుడు డిస్పోజబుల్ గ్లోవ్స్ ను వినియోగించాలి. గ్లోవ్స్ తీసేసిన తర్వాత చేతులను కడుక్కోవాలి.
  • విజిటర్స్​ను అస్సలే అనుమతించకూడదు.
  • హోమ్ క్వారెంటైన్ పీరియడ్ 14 రోజులు. ఆ తర్వాత టెస్టులు చేయించుకుని నెగెటివ్ వస్తే వైరస్​ లేదని అర్థం.

5,617 మంది బలి

కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 250కి పైగా మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా 1,266 మంది అక్కడ కరోనాకు బలయ్యారు. 17,660 కేసులు రికార్డయ్యాయి. చైనాలో కేసులు తగ్గుతున్నాయి. శనివారం 11 కొత్త కేసులు నమోదవగా మొత్తం 80,824 మందికి కరోనా సోకింది. 3,189 మంది చనిపోయారు. కొత్తగా 13 మంది దానికి బలయ్యారు. ఇరాన్​లో 611 మంది కరోనాతో చనిపోయారు. స్పెయిన్​లో 191, సౌత్​కొరియాలో 72, ఫ్రాన్స్​లో 79 మంది చనిపోయారు. మరణాల్లో అమెరికా అర్ధసెంచరీ దాటింది. 51 మంది చనిపోగా, కేసుల సంఖ్య 2,340కి చేరింది. జపాన్​లో 22, బ్రిటన్​లో 21 మంది బలయ్యారు. ప్రపంచమంతటా 5,617 మంది కరోనాకు బలయ్యారు. 1,50,097 మందికి కరోనా సోకింది. అందులో 73,731 మంది కోలుకోగా ప్రస్తుతం 70,749 యాక్టివ్​ కేసులున్నాయి. కరోనా సోకిన దేశాల సంఖ్య 149కి పెరిగింది.