జులై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. విస్తరణపై ఊహాగానాలు

జులై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. విస్తరణపై ఊహాగానాలు

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహగానాల మధ్య 2023  జులై 3న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది.  ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్ భవనంలో ఈ సమావేశం జరగనుంది.  బీజేపీ 9 ఏళ్ల పాలనపై, ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై, 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు.

సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు  ముందు కూడా మంత్రి మండలి సమావేశమవుతుంది. జులై మూడో వారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి మోదీ భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలకా? మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకా? అన్నది తెలియాల్సి ఉంది.  కేంద్ర కేబినెట్ చివరగా 2023 జనవరిలో భేటీ అయింది.  

దాదాపు రెండేళ్లుగా మోడీ మంత్రివర్గంలో పెద్దగా పునర్వ్యవస్థీకరణ జరగలేదు. అయితే, మేలో, మోడీ ప్రభుత్వం కిరణ్ రిజిజును న్యాయ మంత్రిగా తొలగించి , అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను నియమించింది.  2021 జూలైలో మోడీ ప్రభుత్వం 12 మంది మంత్రులను తొలగించి, 17 మంది కొత్త మంత్రులు కేబినేట్ లోకి తీసుకుంది.  

ఇక ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.