V6 News

మళ్లీ ప్రమాణ స్వీకారానికి వస్తా.. మే 4 తర్వాత బెంగాల్‌‌‌‌‌‌‌‌ లో రాబోయేది  బీజేపీనే: ప్రధాని మోదీ

మళ్లీ ప్రమాణ స్వీకారానికి వస్తా.. మే 4 తర్వాత బెంగాల్‌‌‌‌‌‌‌‌ లో రాబోయేది  బీజేపీనే: ప్రధాని మోదీ
  • టీఎంసీ 'సిండికేట్ రాజ్' రాష్ట్రాన్ని ఆర్థిక పతనంలోకి నెట్టేసింది
  • తిట్టడం, బెదిరించడం, అసత్య ప్రచారాలే వారి వ్యూహం
  • ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల సభలో ప్రసంగం

కోల్‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత, బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తాను మళ్లీ రాష్ట్రానికి వస్తానని స్పష్టం చేశారు. రెండో దశ (చివరి దశ) ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

 ‘‘బెంగాల్ ప్రజల మూడ్ చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతోంది. మే 4 తర్వాత ఇక్కడ ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను మళ్లీ రావాల్సి ఉంటుంది’’ అని మోదీ పేర్కొన్నారు. తాను హెలిప్యాడ్‌‌‌‌‌‌‌‌ దిగి వస్తుంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారని, తనను ఆశీర్వదించడానికి వేలాదిమంది  ప్రజలు వస్తారని ఊహించలేదని సంతోషం వ్యక్తంచేశారు.

తీవ్రమైన ఎండలో ఇన్ని ర్యాలీలు నిర్వహించినప్పటికీ తనకు ఏమాత్రం అలసట కలగలేదని అన్నారు. 2024 జనవరిలో అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు తాను చేసిన అనుష్ఠానం సమయంలో ఎలాంటి శక్తిని పొందానో, ఇప్పుడు బెంగాల్ ప్రచారంలో కూడా అదే రకమైన దైవిక శక్తిని అనుభవించానని పేర్కొన్నారు.

అధికార టీఎంసీపై ఫైర్..

బెంగాల్‌‌‌‌‌‌‌‌ను టీఎంసీ సిండికేట్ రాజ్, రాజకీయ హింసతో ఆర్థిక పతనంలోకి నెట్టేసిందని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతుంటే, బాంబు తయారీ కేంద్రాలు మాత్రం వెలుస్తున్నాయని విమర్శించారు. వారు అధికారంలోకి రావడానికి కారణమైన “మా--–మాటి–మానుష్” నినాదాన్నే టీఎంసీ విడిచిపెట్టిందని, ఎన్నికల ప్రచారంలో ఎక్కడా దీన్ని ఉచ్ఛరించలేదని అన్నారు. ఆ పార్టీకి రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి విజన్ లేదని విమర్శించారు. కేవలం తిట్టడం, బెదిరించడం, అసత్యాలు ప్రచారం చేయడమే టీఎంసీ వ్యూహమని ప్రధాని ఎద్దేవా చేశారు.

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన బారక్‌‌‌‌‌‌‌‌పూర్ గడ్డ.. ఇప్పుడు బెంగాల్‌‌‌‌‌‌‌‌లో రాజకీయ మార్పుకు నాంది పలకబోతోందని అన్నారు. తూర్పు భారత్ అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని, బెంగాల్‌‌‌‌‌‌‌‌ను కాపాడటం, సేవ చేయడం తన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. ఒడిశా, బిహార్ తరహాలోనే బెంగాల్‌‌‌‌‌‌‌‌లో కూడా  కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉండాలని, బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

సిక్కింలో మోదీ పర్యటన

సిక్కిం రాష్ట్రం భారత యూనియన్‌‌‌‌‌‌‌‌లో చేరి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ’ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం సిక్కిం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్యాంగ్‌‌‌‌‌‌‌‌టక్​లో ప్రధాని నిర్వహించిన రోడ్‌‌‌‌‌‌‌‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. లిబింగ్ హెలిప్యాడ్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ప్రధానికి సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్‌‌‌‌‌‌‌‌మాథుర్, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఘనస్వాగతం పలికారు.