V6 News

బెంగాల్ ఎన్నికలు : పోలింగ్ ముందు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ వీడియో కలకలం.. బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ట్వీట్స్

బెంగాల్ ఎన్నికలు : పోలింగ్ ముందు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ వీడియో కలకలం.. బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ట్వీట్స్

పశ్చిమ బెంగాల్ చివరి విడత పోలింగ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. 2026, ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో బయటకు వచ్చిన ఓ వీడియో.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బీజేపీ, టీఎంసీ పోటాపోటీగా ఈ వీడియోలపై రచ్చ లేపుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. ఎస్పీ అజయ్ పాల్ శర్మ. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హయాంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. జస్ట్ 22 నెలల్లోనే 136 ఎన్ కౌంటర్లు చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. ఇదే సమయంలో ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధులకు వెళ్లారు. బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల ప్రాంతంలో ఎన్నికల విధుల్లో ఉన్నారు.

ఆ జిల్లాల్లో విధుల్లో ఉన్న సమయంలో.. ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న టీఎంసీ నేత, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ అజయ్ పాల్ శర్మ. గత 50 ఏళ్లల్లో ఎప్పుడూ జరగని విధంగా.. అత్యంత స్వేచ్చగా.. నిస్ఫక్షపాతంగా ఎన్నికలు జరగకుండా ఎవరూ అడ్డుకోలేరు.. ఎవరైనా అతి తెలివి ప్రదర్శిస్తే అడ్డుకోవటానికి సాహసం చేస్తే.. అలాంటి వాళ్లకు తగిన గుణపాఠం ఉంటుంది అంటూ ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ అజయ్ పాల్ శర్మ.. 

పశ్చిమ బెంగాల్ బీజేపీ సోషల్ మీడియా అధికారికంగానే ఈ పోస్ట్ చేసింది. ఇది వైరల్ అయ్యింది. అజయ్ పాల్ శర్మ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే.. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కౌంటర్ పోస్ట్ చేశారు. 

ALSO READ : మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్

మీ ఎన్ కౌంటర్ స్పెషల్ అజయ్ పాల్ శర్మను చూడండీ.. ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ ఓ గదిలో ఇద్దరు మహిళలతో కలిసి నృత్యం చేస్తున్నారు అంటూ వీడియోలు రిలీజ్ చేసింది. ఆ వీడియోలో.. ఓ మహిళ నేలపై కూర్చుని ఉండగా.. ఆమె ముందు అజయ్ పాల్ శర్మ నిలబడి చప్పట్లు కొడుతుంటారు.. మరో వీడియోలో ఓ మహిళ తన ముందు నిల్చొని డాన్స్ చేస్తుంది. ఆ గదిలో కలర్ లైట్లు ఉన్నాయి. చుట్టూ మరికొంత మంది సోఫాల్లో కూర్చుని ఉంటారు. 

ఫెయిర్ అండ్ లవ్లీ బాబూ.. మీరు ఫాంటాకాప్ స్టయిల్ లో ఎంజాయ్ చేస్తుండటం చూసి చూసి సంతోషంగా ఉంది. స్టే థండా థండా కూల్ కూల్.. బెంగాల్ ఎల్లప్పుడూ తృణమూల్ దే అంటూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కామెంట్ చేశారు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ జరగనున్న కొన్ని గంటల ముందు ఈ వీడియో రిలీజ్ కావటం కలకలం రేపుతోంది. 24 పరగణాల జిల్లాలో పోలింగ్ బందోబస్తులో ఉన్న ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎస్పీ అజయ్ పాల్ శర్మ తీరు చర్చనీయాంశం అయ్యింది. దొరికిందే సందుగా.. టీఎంసీ ఈ వీడియోపై రచ్చ రచ్చ చేస్తుంది. ఇది ఫేక్ వీడియో అని.. AI వీడియో అంటూ బీజేపీ కౌంటర్ ఇస్తుంది.