దేశం రెండు చట్టాలపై.. ఎలా నడుస్తుంది?

దేశం రెండు చట్టాలపై.. ఎలా నడుస్తుంది?
  • యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కావాల్సిందే: ప్రధాని మోదీ  
  •  ఒకే ఇంట్లో ఇద్దరికి వేర్వేరు రూల్స్ ఉంటయా?  
  •  బుజ్జగింపు, ఓటుబ్యాంకు పాలిటిక్స్ బీజేపీ చేయదు 
  •  భోపాల్​లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోదీ స్పీచ్  

భోపాల్: దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం వర్తించేలా యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) అమలు కావాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా తేల్చిచెప్పారు. రాజ్యాంగం కూడా దేశ పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలనే చెప్తోందన్నారు. ‘మేరా బూత్ సబ్ సే మజ్ బూత్’ క్యాంపెయిన్ కింద దేశవ్యాప్తంగా బూత్​ల స్థాయిలో ఎంపికైన బీజేపీ కార్యకర్తలతో మంగళవారం మధ్యప్రదేశలోని భోపాల్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాని ఈ అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు సైతం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడిందని, కానీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసేటోళ్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘ఒక ఇంట్లో ఒకరికి ఒక రూల్, మరొకరికి ఇంకో రూల్ ఉంటుందా? అలా ఉంటే ఆ ఇల్లు సరిగ్గా నడుస్తుందా? ఒక ఇంటి విషయంలోనే ఇలా ఉంటే మరి 2 చట్టాలతో దేశం ఎలా ముందుకు వెళ్తుంది? మన రాజ్యాంగం కూడా అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్తోందన్న విషయం గుర్తు చేసుకోవాలి” అని ఆయన అన్నారు. 

ముస్లిం దేశాల్లో ట్రిపుల్ తలాక్​ ఏదీ? 

ట్రిపుల్ తలాక్​ను సమర్థించే వాళ్లు ముస్లిం బిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘ట్రిపుల్ తలాక్ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన అంశం అయి ఉంటే పాకిస్తాన్, ఖతర్, జోర్డాన్, ఇండోనేసియా వంటి ముస్లిం దేశాల్లో ఎందుకు బ్యాన్ చేశారు. ఈజిప్టులో 80 ఏండ్ల కిందటే ట్రిపుల్ తలాక్ ను ఎందుకు రద్దు చేశారు?” అని మోదీ ప్రశ్నించారు.   

ఎవరు రెచ్చగొడ్తున్నరో గ్రహించాలె 

యూసీసీ పేరుతో ముస్లింలను రెచ్చగొట్టాలని కొంద రు చూస్తున్నారని మోదీ అన్నారు. ఏ పార్టీ వాళ్లు తమ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారో ముస్లింలు గ్రహించాలని కోరారు. ‘‘మీరు మీ కొడుకులు, బిడ్డలు, మనుమలు, మనుమరాళ్ల సంక్షేమాన్ని కోరుకుంటే బీజేపీకే ఓటేయండి” అని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు రూ.20 లక్షల కోట్ల స్కాంలు చేశాయని, అవి స్కాంలకు గ్యారంటీగా మారిపోయాయని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీని మళ్లీ అధికారంలోకి తేవాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారన్నారు. 

బుజ్జగింపుల పాలసీతో దేశానికి నష్టం 

ఇతర పార్టీల మాదిరిగా బుజ్జగింపు, ఓటుబ్యాంకు రాజకీయాలు చేయకూడదని బీజేపీ నిర్ణయించుకున్నదని మోదీ చెప్పారు. ‘‘ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే వారు ముసల్మాన్, ముసల్మాన్ అనే మంత్రం జపిస్తున్నారు. వాళ్లు నిజంగా ముస్లింల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారా? అలా చేసి ఉంటే ఇప్పుడు ముస్లింలు విద్య, ఉద్యోగాల్లో వెనకబడి ఉండేవారు కాదు” అని మోదీ అన్నారు. కొంత మంది బుజ్జగింపులనే పాలసీగా మార్చుకోవడం దేశానికి తీవ్ర నష్టంగా మారుతోందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ముస్లింలలో వెనకబడిన పాస్మాండ ముస్లింలను కనీసం సమానంగా చూడట్లేదన్నారు. బుజ్జగింపుల పాలసీ కారణంగా యూపీ, బీహార్, దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా కులాలు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. అందుకే బీజేపీ తుష్టికరణ్ (బుజ్జగింపులు) మార్గానికి బదులుగా సంతుష్టికరణ్ (సంతృప్తి) మార్గాన్ని అనుసరిస్తుందన్నారు.   

5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభం  

ప్రధాని మోదీ మరో 5 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభించారు. మంగళవారం భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్​లో జెండా ఊపి రెండు ట్రెయిన్లను, అక్కడి నుంచే వర్చువల్ గా మూడు ట్రెయిన్లను ఆయన ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో రాణి కమలాపతి(భోపాల్)–జబల్ పూర్, ఖజురహో–భోపాల్–ఇండోర్, మద్గావ్(గోవా)–ముంబై, ధార్వాడ్–బెంగళూరు, హతియా–పాట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. గోవాలో ఇదే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ ట్రెయిన్ గోవాలోని మద్గావ్ నుంచి సహ్యాద్రి పర్వతాల మీదుగా ముంబై వరకు నడుస్తుంది.