- రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
- పోస్టర్‌ను ఆవిష్కరించిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
- బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ కే పరిమితమని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 10న రాష్ట్ర పర్యటనకు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు జనాగ్రహ సభ అని పేరు పెట్టినట్టు చెప్పారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్ తదితరులతో కలిసి రాంచందర్ రావు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనలో భాగంగా హైదరాబాద్ సిటీలో దాదాపు రూ.7,700 కోట్ల నుంచి రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి అని, అలాగే తాను పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ప్రధాని రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. మే10న మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ సభలో మోదీ ప్రసంగిస్తారని వెల్లడించారు.
భారత్ జోడో అంటూ కాంగ్రెస్ చేస్తున్నది వాస్తవానికి దేశాన్ని విభజించే తోడో యాత్ర అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, అందుకే ఈ సభకు జనాగ్రహ సభ అని పేరు పెట్టామన్నారు.
బీఆర్ఎస్ ఫ్యామిలీకే పరిమితం..
బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలను పక్కనపెట్టి కేవలం కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైందని రాంచందర్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేబినెట్‌లో సరైన ప్రాతినిధ్యం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, యువత, మహిళలు, మేధావులు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులోనూ బీజేపీ సత్తా చాటుతుందని, పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగురుతుందన్నారు. మోదీ సభకు మేధావులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

