రేపు (మే10 ) తెలంగాణకు ప్రధాని మోదీ

రేపు (మే10 ) తెలంగాణకు  ప్రధాని మోదీ
  • రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
  • జహీరాబాద్ స్మార్ట్ సిటీ, ఎన్ హెచ్ 167 పనులకు శంకుస్థాపన
  • సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్​లో సభ   
  • లోక్‌‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణకు ప్రధాని

హైదరాబాద్, వెలుగు: 2024 లోక్‌‌సభ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ. 9,400 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో  రూ. 2,360 కోట్లతో జహీరాబాద్‌‌ ‘ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ’కి శంకుస్థాపన చేయడంతో పాటు, రూ. 3,180 కోట్లతో ఎన్ హెచ్-167 (గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌‌నగర్) నాలుగు లేన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

రైల్వే రంగంలో రూ. 1,250 కోట్లతో నిర్మించిన కాజీపేట, విజయవాడ మూడో రైల్వే లైన్ సెక్షన్‌‌ను జాతికి అంకితం చేస్తూనే, రూ. 300 కోట్లతో నిర్మించిన కాజీపేట ‘రైల్ అండర్ రైల్’ బైపాస్‌‌ను ప్రారంభించనున్నారు. టెక్స్‌‌టైల్ రంగం అభివృద్ధి కోసం రూ. 1,700 కోట్లతో పీఎం మిత్ర పార్క్, కాకతీయ మెగా టెక్స్‌‌టైల్ పార్క్ పనులకు పచ్చజెండా ఊపనున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు ఇంధన రంగంలోనూ పురోగతి సాధించేలా రూ. 610 కోట్లతో మల్కాపూర్‌‌లో ఐఓసీఎల్ టెర్మినల్‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు.. విద్య, వైద్య రంగాలకు కూడా కేంద్రం పెద్దపీట వేసింది.

స్టెమ్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 33 బాలికల హాస్టళ్లను నిర్మిస్తోంది. నైపర్ హైదరాబాద్‌‌ను రూ. 10వేల కోట్లతో చేపట్టిన ‘శక్తి’ ప్రోగ్రామ్ ద్వారా అంతర్జాతీయ స్థాయి బయోఫార్మా రీసెర్చ్ హబ్‌‌గా తీర్చిదిద్దనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించే మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటన్నింటినీ ప్రధాని వర్చువల్ మోడ్​లో ప్రారంభించనున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

పరేడ్  గ్రౌండ్స్​లో భారీ బహిరంగ సభ

నగరంలో మధ్యాహ్నం వరకు పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ.. సాయంత్రం బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6:30 - నుంచి 7:30 వరకూ పరేడ్ గ్రౌండ్స్‌‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు సుమారు 2 లక్షల మందిని తరలించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు.. జనసమీకరణపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.