- మా నిర్ణయం సముచితమేనన్న షరీఫ్
- బంగ్లాదేశ్‌కే మా మద్దతు
- రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్
కరాచీ: టీ20 వరల్డ్ ఆరంభానికి ఒక్క రోజే సమయం మిగిలి ఉన్నా.. పాకిస్తాన్ వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. మెగా టోర్నీలో ఇండియాతో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం తేల్చి చెప్పారు. తమ నిర్ణయం సముచితమేనని మరోసారి స్పష్టం చేశారు. ‘క్రీడల్లో ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి మేం టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడబోమనే స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. బంగ్లాకు మేం అండగా ఉంటాం. మా నిర్ణయం సరైనదేనని భావిస్తున్నాం’ అని షరీఫ్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ‘ధన్యవాదాలు పాకిస్తాన్’ అని అధికారిక పేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
మేం కొలంబో వెళ్తున్నాం..
పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించినా.. తాము మాత్రం కొలంబోకు వెళ్తున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ఇప్పటికే విమానం కూడా బుక్ అయ్యిందన్నాడు. ‘పాక్ నిర్ణయం నా నియంత్రణలో లేదు. వారి నిర్ణయాలు కూడా నేను తీసుకోగలిగితే బాగుండేది. కానీ అలా జరగదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాలా? వద్దా? అనేది వారి ఇష్టం. ఆసియా కప్‌లో పాక్‌తో మేం మూడు మ్యాచ్‌లు ఆడాం.
అక్కడ మంచి క్రికెట్ ఆడి అన్ని మ్యాచ్‌ల్లో గెలిచాం. కాబట్టి మా మైండ్‌సెట్ చాలా క్లియర్‌గా ఉంది. పాక్‌తో ఆడబోమని మేం ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. వారే వద్దనుకున్నారు. మ్యాచ్‌ను ఐసీసీ షెడ్యూల్ చేసింది. కొలంబో వెళ్లడానికి మాకు టికెట్టు కూడా బుక్ అయ్యాయి. కాబట్టి అవకాశం వస్తే కచ్చితంగా మ్యాచ్ ఆడతాం’ అని సూర్య స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం అమెరికాతో మ్యాచ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టామన్నాడు.
