భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, దాడికి తెగబడిన పదిమంది వ్యక్తులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె ఇంటికి ఓ బాలుడు వచ్చాడు. అయితే, దీనిని గమనించిన స్థానికులు కొందరు.. ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న బాలుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడమే కాకుండా, బయటకు లాక్కొచ్చి స్తంభానికి కట్టేసి కర్కశంగా దాడి చేశారు.
అంతటితో ఆగకుండా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలిక పట్ల ఆ పదిమంది వ్యక్తులు అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె శరీరంపై చేతులు వేసి వేధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు.. ఆకతాయిలు చేసిన అరాచకాన్ని బాలిక కన్నీళ్లతో వివరించింది. తమ ఇంట్లోకి జొరబడి, తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో దిగ్భ్రాంతికి గురైన బాలిక తల్లి.. వెంటనే అన్నపురెడ్డిపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పదిమంది నిందితులపై పోలీసులు పోక్సోచట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలిక పట్ల క్రూరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
