ఫారెస్ట్​ ఆఫీసర్లు నాటిన మొక్కలు తొలగించిన పోడుదారులు

ఫారెస్ట్​ ఆఫీసర్లు నాటిన మొక్కలు తొలగించిన పోడుదారులు

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: ఇరవై ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములను వదులుకునే ప్రసక్తే లేదని పోడు రైతులు తేల్చిచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మద్దుకూరు బీట్​ పరిధిలోని కంపగూడెం,పెంట్లం, నామవరం సరిహద్దులో 94 హెక్టార్లలో గిరిజనులు పోడు సాగు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం హక్కుపత్రాలు లేవంటూ పోలీసుల సహకారంతో ఫారెస్ట్​ ఆఫీసర్లు ఆ భూమిలో మొక్కలు నాటారు. శనివారం కంపగూడెం, నామవరం గ్రామాలకు చెందిన పోడు రైతులు 23 హెక్టార్లలో మొక్కలను తొలగించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. తాము చావడానికైన సిద్ధమని, పోడు భూములను వదులుకునే ప్రసక్తే లేదని పోడుదారులు వాగ్వాదానికి దిగారు. ఎఫ్​డీవో అప్పయ్య, జూలూరుపాడు సీఐ వసంతకుమార్ అక్కడకు చేరుకొని పోడుదారులతో మాట్లాడారు. ఐటీడీఏ పీవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. రేంజర్​ శ్రీనివాసరావు, ఎస్సై విజయ పాల్గొన్నారు. ​