రేవంత్ చెప్పింది అబద్ధం.. ఆయనపై న్యాయపోరాటం చేస్తం: కిషన్ రెడ్డి

రేవంత్ చెప్పింది అబద్ధం..  ఆయనపై న్యాయపోరాటం చేస్తం: కిషన్ రెడ్డి
  • రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా?
  • రేవంత్, కేటీఆర్​కు సంజయ్ సవాల్
  • అమిత్ షా మార్ఫింగ్ వీడియోతో కుట్ర : కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు:  కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజ ర్వేషన్లు రద్దు అవుతాయంటూ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ మాటలు అబద్ధమని అన్ని వర్గాల ప్రజలకూ అర్థమైందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్​కు సంబంధించి ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. దీనిపై స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పందించారన్నారు. తాము రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. రేవంత్​కు నైతికత ఉంటే ఆరోపణలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణప్రసాద్, ప్రకాశ్ రెడ్డి, ఎన్​వీ సుభాష్ తదితరులతో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ హవాను తట్టుకోలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్ క్షుద్ర రాజకీయాలకు తెరలేపాయన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారని, హైదరాబాద్ ను యూటీగా మారుస్తారంటూ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఎంఐఎం అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నాయని, ఈ విషయం కాంగ్రెస్ నేతనే బహిరంగంగానే చెప్పారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ చేయడం వెనక రేవంత్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. ఆయనను కోర్టుకు లాగుతామని స్పష్టం చేశారు. కేంద్రంలో హంగ్ వస్తుందని.. ఢిల్లీకొచ్చి చక్రం తిప్పుతామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.   

బీజేపీలోకి నేతకాని వెంకటేశ్, పెద్దిరెడ్డి  

కిషన్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీలో 35 ఏండ్లు పనిచేశానని, గతంలో బీజేపీలోనూ మూడేండ్లు పనిచేశానని తెలిపారు. ప్రజా సేవ కోసం రావాలని కేసీఆర్ కోరితే బీఆర్ఎస్ లో చేరానని, కానీ ఆయన తీరు నచ్చక తిరిగి బీజేపీలోకి వచ్చానన్నారు. నేతకాని వెంకటేశ్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం పట్ల సంతోషంగా ఉందని, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.