నన్ను అరెస్టు చేస్తరట .. గాంధీభవన్​కు ఢిల్లీ పోలీసులను పంపిన్రు: సీఎం రేవంత్

నన్ను అరెస్టు చేస్తరట ..  గాంధీభవన్​కు ఢిల్లీ పోలీసులను పంపిన్రు: సీఎం రేవంత్

 

  • ఇన్నాళ్లు ఈడీ, సీబీఐ, ఐటీని వాడుకున్న కేంద్రం.. 
  • ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పోలీసులనూ వాడుకుంటున్నది
  • నేను పోలీసులకు భయపడను
  • బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తదని వ్యాఖ్య 
  • కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో కలిసి కర్నాటకలో ఎన్నికల ప్రచారం 

హైదరాబాద్, వెలుగు:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నన్ను అరెస్ట్ చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఢిల్లీ పోలీసులను పంపింది. హైదరాబాద్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు.. గాంధీభవన్ లో మా సోషల్ మీడియా టీమ్ కు నోటీసులు ఇచ్చిన్రు. ఇప్పటిదాకా ఈడీ, సీబీఐ, ఐటీని వాడుకున్న కేంద్ర సర్కార్.. కొత్తగా ఢిల్లీ పోలీసులనూ వాడుకుంటున్నది’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్​ స్టార్ క్యాంపెయినర్​గా ఉన్న రేవంత్.. సోమవారం కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి గుర్మిట్కల్, సేడంలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘బీజేపీపై విమర్శలు చేసేటోళ్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వచ్చి హడావుడి చేసిన్రు. మా సోషల్ మీడియా టీమ్​కు నోటీసులు ఇచ్చిన్రు.  నన్ను అరెస్ట్​ చేస్తరట. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను వాడుకునే మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఢిల్లీ పోలీసులనూ వాడుకుంటున్నది. కానీ రేవంత్​ పోలీసులకు భయపడడు’’ అని అన్నారు. 

కరువొస్తే ఖాళీ చెంబు ఇచ్చిండు..  

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారని రేవంత్ ఆరోపించారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంలో కర్నాటక నుంచి 25 మంది ఎంపీలను గెలిపించి, మోదీని గద్దె దించడానికి సహకరించాలని కోరారు. ‘‘కర్నాటకలో కరువు వస్తే.. మోదీ ఎలాంటి సహాయం చేయలేదు. ప్రధాని హోదాలో మోదీ కర్నాటకకు ఇచ్చిందేం లేదు.. ఖాళీ చెంబు తప్ప’’ అని విమర్శించారు. కరువు వస్తే బెంగుళూరుకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. కర్నాటక నుంచి బీజేపీకి 26 మంది ఎంపీలను ఇస్తే, మోదీ కర్నాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవి అని ఫైర్ అయ్యారు. 

ఖర్గేకు అండగా నిలవాలి.. 

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కర్నాటక ప్రజలు అండగా నిలవాలని రేవంత్ కోరారు. ‘‘ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఖర్గేకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మీపై ఉంది. మోదీకి గుజరాత్ అండగా ఉన్నట్టే.. ఖర్గేకు కర్నాటక అండగా నిలవాలి. ఈ ఎన్నికలు కర్నాటక వర్సెస్ గుజరాత్ గా మారాయి. మొన్న కర్నాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఐదు గ్యారంటీలను అమలు చేసింది. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నాం. మోదీ పదేండ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. నల్లధనం తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పి మోసం చేశారు. 40 కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ... ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదు” అని మండిపడ్డారు. 

మోదీ ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నడు: ఖర్గే

ప్రధాని మోదీ ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ చీఫ్​మల్లికార్జున​ఖర్గే అన్నారు. ‘‘ఫస్ట్, సెకండ్ ఫేజ్ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇది మోదీని ఆందోళనకు గురిచేస్తున్నది. అందుకే ఆయన కాంగ్రెస్​పై బురదజల్లుతున్నరు. అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను కాంగ్రెస్ గుంజుకుంటుందని అసత్య ఆరోపణలు చేస్తున్నరు” అని ఖర్గే మండిపడ్డారు. తాము మేనిఫెస్టోలో అలా చెప్పలేదని స్పష్టం చేశారు.