అలీఘర్: అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఉపాధ్యాయుడిని బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనతో యూనివర్సిటీ ఉలిక్కిపడింది. విద్యార్థులు, సిబ్బంది ఈ ఘటనతో బెంబేలెత్తిపోయారు. చనిపోయిన ఉపాధ్యాయుడిని AMUలోని ABK యూనియన్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు రావు డానిష్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో AMU క్యాంపస్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైబ్రరీ క్యాంటీన్ సమీపంలో జరిగింది.
డానిష్ తన ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుతుండగా స్కూటర్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. డానిష్ తలను టార్గెట్ చేసి రెండు సార్లు కాల్పులు జరిపారు. అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. JN మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు డానిష్ను ట్రీట్మెంట్ నిమిత్తం హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ డానిష్ ప్రాణాలు కోల్పోయాడు. యూనివర్సిటీ లైబ్రరీ దగ్గరలో ఈ ఘటన జరిగందని AMU ప్రొఫెసర్ మహ్మద్ వాసిమ్ అలీ తెలిపారు. ఎస్పీ మయాంక్ పాతక్ పోలీస్ టీమ్స్తో కలిసి స్పాట్కు చేరుకున్నారు.
