టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు, రోషన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `ఛాంపియన్` (Champion). దర్శకుడు ప్రదీప్ అద్వైతం పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి. మలయాళి బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.
నిజాం కాలం నాటి కథతో తెరకెక్కిన `ఛాంపియన్`.. గురువారం (2025 డిసెంబర్ 25న) థియేటర్స్లో విడుదలైంది. హీరో రోషన్ 'పెళ్లి సందD' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ దాదాపు 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని, ఇప్పుడు ఛాంపియన్తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. మరి `ఛాంపియన్` మూవీ ఎలా ఉంది? రోషన్కి హిట్ పడిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
మైఖేల్ సి.విలియమ్స్ (రోషన్) సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. దానికి ఫుట్‌బాల్ ఆట ఒక్కటే సరైన మార్గం అని భావిస్తాడు. ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని కఠోర శ్రమలో నిమగ్మవుతాడు. ఈ క్రమంలోనే మైఖేల్ ధ్యేయానికి అతడి తండ్రి వీరత్వం అడ్డంకిగా నిలుస్తుంది. అలా అతను ఇంగ్లాండ్ వెళ్లాలంటే, బీదర్లో తుపాకులు డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, బీదర్ వెళ్లాల్సిన మైఖేల్.. తుపాకులు ఉన్న ట్రక్కుతో పాటు బైరాన్ పల్లిలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనలతో మైఖేల్ జీవితం పూర్తిగా మలుపు తిరుగుతుంది
ఇంతకీ మైఖేల్ తుపాకులను ఎందుకు డెలివరీ చేయాల్సి వచ్చింది? అతని తండ్రి చేసిన తప్పిదం ఏమిటి? బైరాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకున్న సమస్యలు ఏమిటి? ఆ సమస్యలకు అండగా ఉండటం కోసం మైకేల్ ఏం చేశాడు? మైఖేల్పై ఉన్న పగతో నిజాం పోలీస్ ఆఫీసర్, బాబు దేశ్ ముఖ్ (సంతోష్ ప్రతాప్) ఏం చేస్తాడు? భైరాన్ పల్లి ప్రజలు నిజాం ఆఫీసర్స్, రజాకార్లను ఎలా ఎదుర్కొన్నారు? ఇందులో చంద్రకళ (అనశ్వర రాజన్) పాత్ర ఏమిటి? చివరికి మైఖేల్ ఇంగ్లాండ్ వెళ్లాడా ? లేదా అన్నదే మిగతా కథ
విశ్లేషణ:
1948లో జరిగిన బైరాన్ పల్లి ఘటన గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ను సృష్టించి, యాక్షన్ వార్ డ్రామాగా తెరకెక్కించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పాలనలో ఉన్న రోజులవి. ఆ కాలానికి సంబంధించిన అన్ని రకాల రిఫరెన్సులు తీసుకుని, ప్రతీది రీసెర్చ్ చేసి తెరకెక్కించారు.
బైరాన్‌పల్లి కథలోకి లోతుగా వెళ్తే..
బైరాన్‌పల్లి.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలంలో ఉన్న ఒక చారిత్రక గ్రామం. నిజాం కాలంలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, 100 మందికి పైగా గ్రామస్థులు ప్రాణత్యాగం చేసిన వీరత్వానికి ఈ గ్రామం ప్రతీకగా నిలుస్తుంది. గ్రామంలోని బురుజు (కోట) వారి పోరాటానికి గుర్తుగా ఉంది.
ఇది జలియన్‌వాలా బాగ్ మారణహోమాన్ని తలపించే ఘటన. ఆగస్టు 27, 1948న రజాకార్లు గ్రామంపై దాడి చేసి, సుమారు 119 మంది గ్రామస్తులను చంపి, వారి శవాలను ఊరి మధ్యలో ఉన్న బురుజు చుట్టూ ఉంచి బతుకమ్మ ఆడించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం అయిన ఈ కథను ఆధారంగా చేసుకుని ‘చాంపియన్’ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు.
సినిమా కథగా వెళితే..
ఫస్టాఫ్ ప్రారంభంలోనే 'ఆపరేషన్ పోలో'కి సంబంధించిన నిజాం పాలన, రజాకార్ల దారుణాల్ని క్లుప్తంగా పరిచయం చేశారు. ఆ తర్వాత మైఖేల్ పాత్ర ఎంట్రీ, ఇంగ్లాండ్ వెళ్లాలనే అతని తపన, అందుకోసం ఫుట్ బాల్ ఆట, ఆ తర్వాత తుపాకుల ట్రక్కుతో బైరాన్‌పల్లి గ్రామం వైపు ప్రయాణం.. ఈ పోర్షన్స్ అన్నీ ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు ప్రదీప్.
ఈ క్రమంలోనే భైరాన్ పల్లిపై రజాకార్లు చేసిన మారణదాడి, అక్కడ రోషన్ ఎదుర్కునే సీన్స్తో ఒక్కసారిగా సినిమా హై మూమెంట్కి వెళ్తుంది. దీంతో సెకండ్ హాఫ్ కథనంపై ఆసక్తి నెలకొంటుంది. ఆ తర్వాత నిజాం రజాకార్లు-భైరాన్ పల్లి మధ్య జరిగే పోరాటం, మైఖేల్ ప్రేమకథ.. ఇంటెన్స్ వేలో కథనం నడిపించిన తీరు ఆసక్తిగా మారుతుంది. నిజాం పోలీస్ ఆఫీసర్ బాబు దేశ్ముఖ్ పాత్ర ఎంట్రీ ఇచ్చాక సినిమా మరింత ఉత్కంఠగా సాగుతుంది. కట్టిపడేసే క్లైమాక్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.
ఎవరెలా నటించారంటే:
మైఖేల్ అనే టైటిల్ రోల్ కోసం నిఖార్సైన హైదరాబాదీ యాసలో మాట్లాడి మెప్పించాడు. ఫుట్ బాల్, హార్స్ రైడింగ్ లో శభాష్ అనిపించుకున్నాడు. అప్పటి కాలానికి చెందిన తెలంగాణ యువకుడిగా తెరపై సహజంగా కనిపించి సక్సెస్ అయ్యాడు రోషన్. ప్రాణం పెట్టి నటించాడని చెప్పొచ్చు. అలాగే, అనశ్వర రాజన్ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. క్యూట్గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్లో కూడా మెప్పించింది. నెగిటివ్ షేడ్స్లో సంగీత్ ప్రతాప్ ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
