Nawab Cafe Review: వారసత్వం vs డ్రీమ్స్.. సినిమా ఎలా ఉందంటే?

Nawab Cafe Review: వారసత్వం vs డ్రీమ్స్.. సినిమా ఎలా ఉందంటే?

శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా ప్రమోద్ హర్ష తెరకెక్కించిన చిత్రం ‘నవాబ్‌‌‌‌ కేఫ్‌‌‌‌’ (Nawab Cafe). వాస్తవానికి ఈ సినిమాకు ‘చాయ్ వాలా’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, సెన్సార్ రూల్స్, గైడ్‌‌లైన్స్‌‌ కారణంగా ‘నవాబ్ కేఫ్‌‌’గా మార్చారు.

ఫాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమోషన్‌తో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదలైంది. రాజీవ్ కనకాలతో పాటుగా రాజ్‌‌‌‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ ముఖ్య పాత్రల్ని పోషించారు. పాతబస్తీ ఇరానీ చాయ్‌ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ రివ్యూలో చూద్దాం.

కథేంటంటే:

హైదరాబాద్ పాతబస్తీలో రంగనాథ్ (రాజీవ్ కనకాల) “నవాబ్ కేఫ్”ను నడుపుతూ ఉంటాడు. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కేఫ్ ఆయన కుటుంబానికి గర్వకారణం. తాతల కాలం నుంచి వచ్చిన ఈ వారసత్వాన్ని రంగనాథ్ ఎంతో ప్రేమతో, కస్టమర్ల విశ్వాసాన్ని కాపాడుతూ కొనసాగిస్తుంటాడు.

కానీ అతని కుమారుడు రాజా (శివ కందుకూరి) మాత్రం తండ్రి ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ఉంటాడు. అమెరికా వెళ్ళాలని, కోట్లకు కోట్లు సంపాదించాలని కలలు కంటుంటాడు. కుటుంబ వారసత్వం కంటే వ్యక్తిగత విజయానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఇదే సమయంలో రాజా పెదనాన్న కుమారుడు కుమార్ (చైతన్య కృష్ణ) “నవాబ్ కేఫ్”పై కన్నేసి దానిని స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పన్నుతాడు. ఈ నేపథ్యంలో తండ్రి–కొడుకుల మధ్య విభేదాలు మరింత పెరుగుతాయి.

అసలు కుమార్ నవాబ్ కేఫ్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య జరిగే ఘర్షణల పరిణామం ఎలాంటిది? ఇందులో రాజా ప్రియురాలు సఖీ (తేజు అశ్విని) పాత్ర ఏమిటి? రంగనాథ్ తన వారసత్వాన్ని కాపాడగలడా?లేదా? చివరికి “నవాబ్ కేఫ్” చరిత్రలో కలిసిపోయిందా, లేక కొత్త చరిత్ర సృష్టించిందా? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే:

తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్, కామెడీ సీన్స్తో నవాబ్ కేఫ్ తెరకెక్కింది. వారసత్వం, విలువలు, పరంపర అంటూ తండ్రి మడి కట్టుకుని కూర్చుంటే.. కొడుకు మాత్రం డబ్బు, రిచ్ లైఫ్, ఫారిన్ డ్రీమ్స్ అంటూ గాలిలో మేడలు కడుతుంటాడు. ఒకరికి “నవాబ్ కేఫ్” అంటే నాలుగు తరాల గౌరవం, కస్టమర్ల నమ్మకం, చెమట చిందించిన జీవితం. మరొకరికి అది పాతబస్తీ గల్లీలో చిక్కుకుపోయిన చిన్న వ్యాపారం మాత్రమే.

తండ్రికి ఆ కేఫ్ కేవలం బిజినెస్ కాదు.. అది వారి కుటుంబ ఆత్మ, గుర్తింపు, భావోద్వేగం. కానీ కొడుకుకి మాత్రం ఆ వారసత్వం ఒక భారంలా అనిపిస్తుంది. ఈ భావజాల తేడానే సినిమాలో ప్రధాన ఘర్షణగా మారుతుంది. ‘నా చాయ్ విలువ రూ.15లు.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది’ అని  మొదట్లో రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తోనే సినిమా తాలూకూ మెయిన్ థీమ్ అర్ధమవుతుంది.

అయితే, ఈ సినిమా కథనం చూస్తుంటే,  రీసెంట్గా ధనుష్ తెరకెక్కించిన ఇడ్లీ కొట్టు గుర్తొస్తుంది. అక్కడ ఇడ్లీ కొట్టు.. ఇందులో చాయ్ కొట్టు.. అంతే తేడా. ప్రమోద్‌ హర్ష రాసుకున్న పాయింట్ పాతదే అయిన.. స్క్రీన్ ప్లేని తనదైన కోణంలో రాసుకుని ముందుకెళ్లాడు.

అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ, లవ్ సీన్స్ పెద్దగా ఆకట్టుకునేలా ఉండవు. ఇంటర్వెల్ ముందు రాజీవ్ కనకాల చనిపోయే సీన్ మాత్రం ఎమోషనల్ చేస్తోంది. సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్ సీన్ మెప్పించే విధంగా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. చివరగా.. ధనుష్ ఇడ్లీ కొట్టు, కీర్తి సురేశ్‌ మిస్‌ ఇండియా సినిమాలు మాత్రం తప్పక గుర్తుచేస్తోంది ఈ  ‘‘నవాబ్‌‌‌‌ కేఫ్‌‌‌‌’’!!

నటీనటుల నటన:

నటుడు రాజీవ్ కనకాల తన పాత్రలో జీవించేశారు. రాజీవ్ కనకాల రంగనాథ్ పాత్రలో సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. హీరో శివ కందుకూరి.. రాజా పాత్రలో నేటి యువత ఆలోచనలను ప్రతిబింబించాడు. తేజు అశ్విని పాత్రలో ఇంపార్టెన్స్ లేదు. స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకుంటుంది. కుమార్ పాత్రలో చైతన్య కృష్ణ నెగటివ్ షేడ్స్‌ను బాగా ప్రదర్శించాడు.