తిరుమల కొండ కిటకిటలాడుతోంది.. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవు, వీకెండ్ ఉండడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండి, శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు ( డిసెంబర్ 25న) కిటకిటలాడుతున్నాయి
శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటలు సమయం పడుతుంది. టైమ్ స్లాట్ (SDD) దర్శనానికి సుమారు 8 గంటలు.. ఇక రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ఇలా ఉండగా బుధవారం ( డిసెంబర్ 24) తిరుమల శ్రీవారిని 73వేల 524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 29 వేల 989 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో భక్తులు హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...
