
- ‘బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు’ నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్
- దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రంగా మారిన అంశం
- స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్
- అమిత్‌షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్‌పై ఢిల్లీలో కేసు
- గాంధీ భవన్‌కు వచ్చి నలుగురికి నోటీసులిచ్చిన ఢిల్లీ పోలీసులు
- రేపు విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న ‘ బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు’ అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకుని ముస్లింలకు అప్పగిస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ఎత్తుకున్న ఈ అంశం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రంగా మారింది. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణంగా కేంద్రంలోని మోదీ సర్కార్ అడుగులు వేస్తున్నదని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే బీజేపీకి 376 సీట్లు అవసరమవుతాయని, అందుకే ఆ పార్టీ ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ఓట్లు అడుగుతున్నదని కొద్ది రోజులుగా ఆయన ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రేవంత్ఎత్తుకున్న ఈ రిజర్వేషన్ల అంశం.. కాంగ్రెస్ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో వాళ్లు కూడా దీనిపైనే ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. దీంతో కేంద్రంలోని మోదీ, అమిత్‌షా అలర్ట్ అయ్యారు. రేవంత్‌కు గట్టి కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని, అందువల్లే ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రంగా మారిందనే అంచనాకు వచ్చారు. బీజేపీ ఓట్లకు భారీగా గండిపడే ప్రమాదం ఉండడంతో తెలంగాణ లీడర్లకు అమిత్‌షా క్లాస్ తీసుకోవడంతో పాటు నష్టనివారణ చర్యలకు దిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అమిత్ షా వీడియోను కాంగ్రెస్ మార్ఫింగ్ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఓ వీడియోను బయటపెట్టారు.
‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తాం’ అన్నట్టుగా ఉన్న ఆ వీడియో క్లిప్ఆధారంగా ఢిల్లీలో కేసు నమోదైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్చేరుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌లోని నలుగురికి నోటీసులు ఇచ్చారు.
రిజర్వేషన్ల చుట్టే ప్రచారం..
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని గత వారం, పది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయన.. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సోమవారం కర్నాటకలో మల్లికార్జున ఖర్గేతో కలిసి చేసిన ప్రచారంలోనూ ఇదే టాపిక్ ఎత్తుకున్నారు. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా కొద్ది రోజులుగా ఇదే అంశంపై ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను సైతం పక్కనపెట్టి, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు తప్పదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికి తోడు రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ గతంలో కొన్ని హిందూ సంస్థల ప్రతినిధులు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను సైతం వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సోషల్‌మీడియా విభాగం మార్ఫింగ్ చేసినట్టుగా భావిస్తున్న అమిత్‌షా వీడియో క్లిప్పింగ్ఒకటి సామా జిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్టుగా ఉన్న ఆ వీడియో క్లిప్పింగ్మీద ఢిల్లీలోని బీజేపీ లీడర్లు అక్కడి లోకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
బీజేపీ నేతల పోటాపోటీ కౌంటర్లు
రేవంత్ ఎత్తుకున్న రిజర్వేషన్ల రద్దు అంశం జనాల్లోకి వెళ్లడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అలర్ట్ అయినట్టు తెలిసింది. రెండ్రోజుల కిందనే తెలంగాణ బీజేపీ నేతలకు ఆయన క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. రేవంత్ఆరోపణలకు బీజేపీ నేతలు గట్టి కౌంటర్ ఇవ్వకపోవడం వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చిందని చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు పోటాపోటీగా రేవంత్‌కు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. బండి సంజయ్అయితే రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? అని సోమవారం సీఎం రేవంత్‌కు సవాల్‌చేశారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రానికి వచ్చిన మాజీ గవర్నర్తమిళిసై సైతం ఇదే అంశంపై స్పందించారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను ఎత్తివేయదని చెప్పారు. కాగా, రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, లేదంటే కోర్టుకు ఈడుస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌లా మారింది.
గాంధీ భవన్‌కు వచ్చి నోటీసులు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన నలుగురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం గాంధీభవన్‌కు చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి, ఇతర అధికారులు.. పీసీసీ సోషల్ మీడియా ఇన్చార్జ్ మన్నె సతీశ్, శివశంకర్, అస్మా తస్లీమ్, నవీన్ కు నోటీసులు అందజేశారు. వచ్చే నెల 1న ఢిల్లీలోని తమ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, దీనిపై పీసీసీ లీగల్ సెల్ ఇన్చార్జ్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు వచ్చి నోటీసులు ఇచ్చారని, తానే ఆ నోటీసులను తీసుకున్నానని ఆయన చెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు 15 రోజులు గడువు అడిగామన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు రాబోతున్నందునే బీజేపీ ఈ నోటీసుల కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.