ఉడుకుతున్న తెలంగాణ.. సాధారణం కన్నా 5-6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు

ఉడుకుతున్న తెలంగాణ.. సాధారణం కన్నా 5-6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు
  •     నల్గొండ జిల్లా మాథూర్‌‌‌‌లో అత్యధికంగా 45.5 డిగ్రీలు
  •     మరో 4 రోజులు వడగాలులు: వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. వేడి, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బయట ఉష్ణోగ్రతలతో రూమ్ టెంపరేచర్లు కూడా విపరీతంగా పెరగడంతో ఇంట్లో ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

రాష్ట్రంలో సోమవారం 40 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాథూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(త్రిపురారం)లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయిందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాబోయే వారం రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని, పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. మంగళవారం నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సోమవారం అత్యధికంగా 41.8 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా మారింది. రాబోయే రెండ్రోజులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రెండ్రోజులు 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.  

వడదెబ్బతో యువకుడు మృతి

కాగజ్ నగర్, వెలుగు: వడదెబ్బ కారణంగా ఓ యువకుడు చనిపోయాడు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఎల్కపల్లికి చెందిన చౌదరి రవి(29) ఆదివారం ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ పెళ్లికి వెళ్లాడు. అక్కడ ఎండదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.