- మేయర్, చైర్మన్ సీట్లు దక్కాలంటే ప్రతి వార్డు, డివిజన్ కీలకం
- మొత్తం కార్పొరేషన్లు, మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
- మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సీఎం సూచన
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కార్యకర్త నుంచి మంత్రి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఓటు కీలకమేనని అన్నారు. మంగళవారం తనకు ఫోన్ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో రేవంత్ మాట్లాడారు. పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు పార్టీ నియమించిన కో ఆర్డినేటర్లు, డీసీసీ చీఫ్‌లకు అందుబాటులో ఉండాలి సూచించారు.
రాబోయే 12 గంటలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దిశ, దశకు కీలకం అనే విషయం మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్ సానుభూతిపరులు, అభిమానులు, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నవారిని గుర్తించి.. వాళ్లందరినీ పోలింగ్ బూత్‌లకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు.
బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్న వార్డులు డివిజన్లలో, ఇతర అభ్యర్థులకు అనుకూల వాతావరణం కనిపించే స్థానాల్లో ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ సీట్లు కాంగ్రెస్‌కు దక్కాలంటే ప్రతి వార్డు, డివిజన్ అత్యంత కీలకమని అన్నారు. ఇందులో ఏ ఒక్కరు కూడా ఏమరుపాటుతో వ్యవహరించొద్దని సీఎం కోరారు.
సమస్యలు వస్తే వార్ రూమ్‌కు ఫిర్యాదు చేయండి
జూబ్లీహిల్స్‌లో పనిచేసిన అనుభవంతో ఈ ఎన్నికల్లో కూడా గెలుపు దిశగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను రేవంత్ ఆదేశించారు. అంతిమంగా మొత్తం ఏడు కార్పొరేషన్లు, మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా బుధవారం జరగనున్న పోలింగ్ పై అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు.
పోలింగ్ సందర్భంగా సమస్యలు ఎదురైతే గాంధీ భవన్‌లోని వార్ రూంకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే, ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో పార్టీ పరిస్థితి, రాబోయే 12 గంటల్లో ఓటర్లు కాంగ్రెస్‌ను ఆదరించే రీతిలో తీసుకోవాల్సిన చర్యలు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కట్టడిపైనా సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలపై, కేటీఆర్ నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీపై కూడా సీఎం రేవంత్ మంత్రులు, విప్, ఇతర ముఖ్య నేతల నుంచి ఆరా తీసినట్లు సమాచారం.
