- చనిపోయిన వారి డేటా పంపాలని ప్రిన్సిపాళ్లకు ఆఫీసర్ల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తూ సర్వీసులో ఉండగానే చనిపోయిన టీచర్ల కుటుంబాలకు పెన్షన్లు ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. చనిపోయిన వారికి ఫ్యామిలీ పెన్షన్, ఇన్-వాలిడ్ లేదా డిజబిలిటీ పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత? అనే పూర్తి వివరాలను వెంటనే పంపించాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్‌చారి ఆదేశాలు జారీ చేశారు.
నిర్ణీత ప్రొఫార్మాలో సాఫ్ట్, హార్డ్ కాపీల ద్వారా వివరాలు పంపాలని ప్రిన్సిపాళ్లకు స్పష్టం చేశారు. మోడల్ స్కూల్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 38 మంది టీచర్లు సర్వీసులో ఉండగానే మరణించారు.
వారికి ఇప్పటికీ ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదు. టీచర్ల సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం వారికి పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన చేసింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు అందాల్సిన ఫ్యామిలీ పెన్షన్, సీపీఎస్ డెత్ గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ 38 కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
