- చైల్డ్ మ్యారేజెస్పై 100 రోజుల సమరం
- స్కూళ్లు, గుళ్లు దాటి.. ఇప్పుడు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్
- రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ యాక్షన్ ప్లాన్
హైదరాబాద్, వెలుగు: చిన్నతనంలోనే పెళ్లి పీటలు ఎక్కిస్తే.. ఇక జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. చైల్డ్ మ్యారేజెస్ పై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. బాల్య వివాహాలను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్ వివాహ్ ముక్త్ భారత్ పేరుతో వంద రోజుల యుద్ధం ప్రకటించాయి. నిన్నమొన్నటి దాకా స్కూళ్లు, కాలేజీల్లో క్లాసులు తీసుకున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు.. ఇప్పుడు గుళ్లు, పల్లెల్లో అవగాహన కల్పిస్తున్నారు.
మైనర్లకు పెళ్లి చేసే పంతుళ్లు, ఖాజీలు, పాస్టర్లు, సౌండ్ బాక్సులు పెట్టే డీజేలు, టెంట్ హౌస్ ఓనర్లను హెచ్చరిస్తూ... బాండ్లు రాసి తీసుకుంటున్నారు. మూడు దశల్లో సాగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్.. ప్రస్తుతం గ్రామాల్లో తీర్మానాల దశకు చేరింది. మార్చి 8 వరకు జరిగే ఈ క్యాంపెయిన్ లో ఎక్కడ చిన్నపిల్లల పెళ్లి జరిగినా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పంచాయతీల్లో తీర్మానాలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ నడుస్తోంది. ఈనెల 1న మొదలైన ఈ డ్రైవ్ మార్చి 8 మహిళా దినోత్సవం వరకు జరుగుతుంది. ఇప్పటికే సర్పంచ్ లకు జరిగిన ట్రైనింగ్ లో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. గ్రామసభలు పెట్టి ‘మా గ్రామం – బాల్య వివాహరహిత గ్రామం’ అని సర్పంచులు, వార్డు మెంబర్లతో తీర్మానాలు చేయిస్తున్నారు. గోడల మీద వాల్ పెయింటింగ్స్ వేయిస్తున్నారు. ముఖ్యంగా ఊర్లలోని నిరుపేద కుటుంబాలు, బడి మానేసిన పిల్లలు ఎక్కడున్నారో లిస్ట్ రెడీ చేస్తున్నారు. వాళ్లను వెంటనే స్కూళ్లలో చేర్పించడం, ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం వంటివి చేస్తున్నారు.
ఈ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు...
రూరల్ ఏరియాల్లో బాల్య వివాహాలు ఇప్పటికీ ఆగకపోవడానికి పేదరికమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్తూ.. ఆడపిల్లను రక్షణగా ఇంట్లో ఉంచలేక, భారం దించుకోవాలనే ఉద్దేశంతో మేనమామకో, దగ్గరి బంధువుకో ఇచ్చి కట్టబెడుతున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీతో పాటు సిటీ శివారులోని స్లమ్ ఏరియాల్లోనూ మైనర్ల పెళ్లిళ్లు గుట్టుగా సాగుతున్నట్లు అధికారుల సర్వేలో తేలింది.
బడి నుంచి గుడి దాక...
మూడు దశల అవగాహన కార్యక్రమంలో భాగంగా మొదట ఫస్ట్ స్పెల్ స్కూల్స్, కాలేజీలపైనే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఫోకస్ పెట్టింది. గతేడాది నవంబర్ 27 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ దశ కొనసాగింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లోని స్టూడెంట్లకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై వివరించారు. క్లాస్ రూముల్లోనే సెన్సిటైజేషన్ సెషన్లు, డిబేట్లు, వ్యాసరచన పోటీలు పెట్టారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జనవరి 1 నుంచి 31 వరకు రెండో దశలో గుళ్లు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలపై నిఘా పెట్టారు. పెళ్లిళ్లు చేసే పంతులు, ఖాజీలు, పాస్టర్లతో పాటు పెళ్లికి టెంట్ వేసేవాళ్లు, డీజేలు, క్యాటరింగ్ వాళ్లను పిలిచి మీటింగ్ పెట్టారు.
