పుర‘పోరు’.. ప్రలోభాల జోరు: ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల దాకా..

పుర‘పోరు’.. ప్రలోభాల జోరు: ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల దాకా..

ఓట్లకు నోట్లు పంచిన అభ్యర్థులు 
డిమాండ్​ను బట్టి ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల దాకా..
చికెన్​, మటన్​, మందు బాటిళ్లు, చీరలు, టిఫిన్​బాక్సులు, ఇతర కానుకలు
పలుచోట్ల ఓటేసేటోళ్లను చూపి మరీ వసూలు చేసుకున్న జనం


నెట్​వర్క్, వెలుగు: తెల్లారితే మున్సిపోల్స్​..రాత్రంతా నేతలు, అభ్యర్థులు, వారి అనుచరులకు నిద్రలేదు.. తమ గెలుపునకు, ఓటమికి నడుమ కొన్ని గంటలే మిగిలి ఉండడంతో చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు తెరతీశారు. పార్టీలకతీతంగా పంపకాల్లో పోటీపడ్డారు. చిన్నచితక మున్సిపాలిటీల్లో ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల దాకా,  పెద్ద మున్సిపాలిటీల్లో రూ.3వేల వరకు, కార్పొరేషన్లలో రూ.5 నుంచి రూ.10వేల దాకా పంపిణీ చేశారు. హైదరాబాద్​సిటీ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో రేటు రూ.10వేలూ దాటిపోయింది. 

పైసలతో పాటు చికెన్​, మటన్​ ప్యాకెట్లు, మందు బాటిళ్లు, మహిళకు చీరలు, టిఫిన్​బాక్సులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓటర్ల పంటపండింది. పలుచోట్ల ఇంట్లో ఓటేసేవాళ్లందరినీ  లెక్కచూపి మరీ డబ్బులు వసూలుచేసుకున్న తీరు ముక్కునవేలేసుకునేలా చేసింది. ఇక ఉద్యోగాలు, ఉపాధి రీత్యా హైదరాబాద్​సిటీకి వలస వచ్చిన కుటుంబాలకు అభ్యర్థులు ఫోన్లు చేసి రప్పించుకున్నారు.

ఇందుకోసం  రాను, పోను ప్రయాణ ఖర్చులతో పాటు ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేల దాకా సమర్పించుకున్నారు. క్యాష్​కు ఇబ్బంది లేకుండా అనుచరులు,  బంధువుల ద్వారా ఓటర్ల ఫోన్​ నంబర్లకు యూపీఐ ట్రాన్సాక్షన్స్​చేయిస్తుండడంతో వీరిని పట్టుకోవడం ఎన్నికల అధికారులు, పోలీసులకు వీలుకావడం లేదు.

ఖమ్మం జిల్లా ఏదులాపురంలోని ఓ వార్డు అభ్యర్థి సోమవారం ఉదయం ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు. అదేరోజు రాత్రి అతని ప్రత్యర్థి రూ.5 వేలు, కేజీ చికెన్, క్వార్టర్​ బాటిల్ పంచారు. దీంతో రూ.3 వేలు పంపిణీ చేసిన అభ్యర్థి కూడా మంగళవారం మరో రూ.2 వేలు పంచవలసివచ్చింది. వైరాలో మున్సిపల్ చైర్ పర్సన్​ రేసులో ఉన్న ఒక మహిళా అభ్యర్థి రూ.5 వేల చొప్పున ఇవ్వగా.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి రూ.5 వేలతో పాటు ఖరీదైన చీర  పంపిణీ చేశారు.
    
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో రూ .2 వేల నుంచి 5వేల  వరకు పంపిణీ చేస్తున్నారు. చీరలు, గిఫ్ట్  బాక్సులు, కిలో మటన్  పంపిణీ చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో సీపీఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్  పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. రూ.1,500 నుంచి 2 వేల వరకు ఇస్తున్నారు. పలు డివిజన్లలో కిలో చికెన్ ఇస్తున్నారు. ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్  రూ. వెయ్యి నుంచి రూ.3 వేల వరకు  పంపిణీ చేస్తున్నాయి.  
    
సూర్యాపేట మున్సిపాలిటీలో ఓ బీజేపీ అభ్యర్థి ఓటుకు.రూ.5వేలు పంపిణీ చేశారు. ఓ ఇంట్లో 9 ఓట్లుండగా ఏకంగా రూ.50వేలు ఇచ్చారు. 
    
యాదాద్రి జిల్లా ఆలేరులోని ఓ వార్డులో ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు పంచారు. ఓ వార్డులో ఒక పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.4 వేలు ఇచ్చాడు. దీంతో అతని ప్రత్యర్థి రూ.7 వేలు ఇచ్చారు. మొదటి అభ్యర్థి మరో వెయ్యి కలిపితే.. రెండో అభ్యర్థి ఏకంగా రూ. 10 వేలు చొప్పున ఇచ్చాడు. మొదటి అభ్యర్థి అదనంగా ఓ చీర ఇచ్చి వెళ్లాడు.
    
చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్  అభ్యర్థి ఒకరు ఓటుకు రూ. 2 వేలతో పాటు ఒక చీర, క్వార్టర్  బాటిల్, కిలో చికెన్  పంపిణీ చేశాడు.
    
మెదక్  జిల్లా మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల చొప్పున ఒక్కొక్కరు వంద నుంచి రెండు వందల మందికి పంపిణీ చేశారు. మెదక్ లో కొన్ని వార్డుల్లో కుల సంఘాలకు ఓటర్ల సంఖ్యను బట్టి గంపగుత్తగా రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఇచ్చారు.
    
గద్వాల మున్సిపాలిటీలో చైర్మన్​ పదవిని ఆశిస్తున్న ఓ అభ్యర్థి  ఓటుకు రూ.5 వేల  వరకు పంచుతున్నారు. 36వ వార్డులో రూ.4 వేలు ఇస్తుండగా, మరికొన్ని వార్డుల్లో రూ. 2 వేలు, 3 వేల చొప్పున పంచుతున్నారు.  చింతలపేట కాలనీలో రూ. వెయ్యితో పాటు చీరలు పంపిణీ చేస్తున్నారు.
    
వనపర్తి మున్సిపాలిటీలో ఓటుకు రూ.1,500,  రాయల్  స్టాగ్  క్వాటర్  బాటిల్  ఇస్తున్నారు. పెబ్బేరులో ఒక వార్డులోనే రూ.5 వేల పైనే ఇస్తున్నారు. కాస్ట్లీ మద్యం ఆఫ్  బాటిల్  ఇస్తున్నారు. కొత్తకోటలో రూ.2 వేలు,  ఆత్మకూరు, అమరచింతల్లో రూ.వెయ్యి, క్వార్టర్  మద్యం ఇస్తున్నారు.
    
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో ఓటుకు రూ.2,500 చొప్పున ఇస్తున్నారు. 4 వార్డులో బీఆర్ఎస్​ అభ్యర్థి రూ.3 వేలు, బీజేపీ అభ్యర్థి ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు, ఇంటికి కేజీ మటన్, చికెన్, కూల్  డ్రింక్స్  పంపిణీ చేస్తున్నారు.  
    
మహబూబ్ నగర్  జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో లీడర్లు పెద్ద మొత్తంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇంటింటికి అర కేజీ మటన్, కిలో చికెన్  పంపిణీ చేశారు. రూ.3 వేల విలువైన  నిత్యావసర వస్తువులను ఇంటింటికి అందించారు. హోటళ్లలో బిర్యానీలతో దావత్  ఏర్పాటు చేశారు.
    
నిజామాబాద్  కార్పొరేషన్​ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ  అభ్యర్థులు కుల సంఘాలకు రూ.2 లక్షల నుంచి రూ. 4 లక్షలు ఇచ్చారు. ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. కిలో చికెన్, మగవారికి క్వార్టర్  బాటిల్, మహిళలకు కూల్  డ్రింక్  సీసాలు పంచారు. మేయర్  కాండిడేట్స్ గా ప్రచారంలో ఉన్న ఒక కాంగ్రెస్  అభ్యర్థిని ఓటుకు రూ.2 వేల నుంచి రూ. 3 వేల చొప్పున పంచారు. బీజేపీ మేయర్  క్యాండిడేట్​ రూ. 2 వేల చొప్పున పంపిణీ చేశారు.
    
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొన్ని వార్డుల్లో ప్రధాన పార్టీలు ఓటుకు రూ.2,500 చొప్పున  పంపిణీ చేశాయి. పాత టౌన్​లో ఓటుకు రూ. 500 నుంచి రూ.1,500 వరకు ఇచ్చారు. పట్టణంలోని ఓ అభ్యర్థి ఇంటికి అర గ్రాము బంగారం చొప్పున పంపిణీ చేస్తున్నాడు.