రంజాన్ కు సిద్ధం..నిఘా నీడలో హైదరాబాద్

రంజాన్ కు సిద్ధం..నిఘా నీడలో హైదరాబాద్

హైదరాబాద్, వెలుగు: రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు అలెర్టయ్యారు. రంజాన్ ముగిసే దాకా పాతబస్తీతో పాటు సిటీలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. గురువారం సాలార్ జంగ్ మ్యూజియంలోని ఆడిటోరియంలో  జరిగిన సమీక్ష లో జీ హెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ అధికారులతో పాటు  ముస్లిం మతపెద్దలు, పీస్ కమిటీ మెంబర్లతో  సీపీ అంజనీకుమార్ చర్చించారు. పాతబస్తీ సహా సిటీలోని ప్రార్థనా మందిరా ల వద్ద ఎలాంటి చర్యలు చేపట్టాలో మతపెద్దల నుంచి వివరాలు తీసుకున్నారు. హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి శోభాయాత్రల తరహాలోనే రంజాన్ మాసం ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని  సీపీ చెప్పారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 7 వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రార్థనా మందిరాల వద్ద పార్కింగ్ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఫోకస్ పెట్టామన్నారు. మక్కామసీద్, మీర్ ఆలం ఈద్గా, సికింద్రాబాద్ లోని జామియా మసీద్ తో అన్ని ప్రార్థనా స్థలాల దగ్గర నిరంతర నిఘా ఉంటుందన్నారు.  ఓల్డ్ సిటీలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్ పికెటింగ్ పెట్టారు. దీంతో పాటు ప్రేయర్లు జరిగే ప్రాంతాల్లో  బ్లూకోల్ట్స్,పెట్రోలింగ్ టీమ్ లతో తనిఖీలు చేయనున్నారు. ప్రార్థనా మందిరాల పరిసర ప్రాంతాలను పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకువచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రేయర్లు జరిగే సమయాల్లో అక్కడి మూవ్ మెంట్స్ ను గమనిస్తుంటారు. బందోబస్తులో  స్థానిక పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, మౌంటెడ్ పోలీసు లు, ఆక్టోపస్ బలగాలను అందుబాటులో ఉంచుకున్నారు. మఫ్టీలో పోలీసుల నిఘా, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు.  సోషల్ మీడియాపై ప్రత్యేకనిఘా ఉంటుందని చెప్పారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని సీపీ కోరారు.