
- ములుగు జిల్లాలోకి వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఎస్పీ శబరీష్
- వారి సమాచారంతో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడి
ములుగు, వెలుగు : నాటకీయ పరిణామాల నడుమ ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్రెగుట్టలో పోలీసుల కూంబింగ్ తో విడివిడిగా ములుగు జిల్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ శబరీష్ ప్రకటించారు. శనివారం ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో జిల్లాలోకి ప్రవేశిస్తున్నారని అందిన పక్కా సమాచారంతో శుక్ర, శని వారాల్లో మాటు వేసి మావోయిస్టులను పట్టుకున్నామన్నారు.
కర్రెగుట్ట నుంచి తప్పించుకొని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారనే పక్కా సమాచారంతో నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. డివిజన్ కమిటీ సభ్యుడు కట్టం భీమ్‌తో పాటు ఐదుగురు ఏరియా కమిటీ, 14 మంది సభ్యులు ఉన్నారు. 12 సంఘటనల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారని, వీరి నుంచి 5.5 ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్ 3, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ 4, ఒక 303 , 8ఎంఎం రైఫిల్స్ 4, బోర్ వెపన్ కట్రిదేజేస్ 16, లైవ్ గ్రబెడ్స్ 2, మ్యాగజైన్స్ 17, 180 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
8 మంది లొంగుబాటు..
8 మంది మావోయిస్టులు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంజర గ్రామానికి చెందిన డివిజన్ కమిటీ సభ్యుడు మడకం ఐలా అలియాస్ ఉద్దం సింగ్, అతని భార్య తాము సన్నీ, కోవాసి దేవి, ఓయం దేవి, సోడి ఐతే, వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ సభ్యులు మడకం కోసి, మిలీషియా సభ్యుడు ముచ్చకి భామన్, మడకం ఐతే లొంగిపోయిన వారిలో ఉన్నారు. వారికి రూ.25 వేల చొప్పున తక్షణ సహాయం కింద
అందజేశారు.