తిరుమలలో 7వ మైలు దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తిరుపతి పోలీసులు కేవలం 15 గంటల్లోనే దొంగను పట్టుకున్నారు. 20 బృందాలతో గాలించిన పోలీసులు గురువారం ( జులై 23 ) ఒంగోలు రైల్వే స్టేషన్ లో విగ్రహంతో సహా దొంగను పట్టుకున్నారు. విగ్రహాన్ని తిరుపతికి తరలించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అయితే.. దైవానుగ్రహం కోసమే స్వామివారి విగ్రహం చోరీ చేశానని దొంగ చెప్పడంతో షాక్ అయ్యారు పోలీసులు. పూజ చేసుకునేందుకే విగ్రహం ఎత్తుకెళ్లానని నిందితుడు చెప్పినట్లు వెల్లడించారు పోలీసులు.
రైల్వే పోలీసుల అప్రమత్తతో తక్కువ సమయంలోనే దొంగను పట్టుకున్నామని తెలిపారు తిరుపతి పోలీసులు. పోలీసుల వేగవంతమైన దర్యాప్తు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు భక్తులు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం టీ. నగరపాలేనికి చెందిన 28 ఏళ్ళ పొట్నూరు జశ్వంత్ కుమార్ విగ్రహాన్ని దొంగలించాడని తెలిపారు పోలీసులు. జశ్వంత్ ఇంజనీరింగ్ చదివి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడని... ఆ తర్వాత జాబ్ పోవడంతో మూడేళ్ళుగా ఖాళీగానే ఉంటున్నాడని తెలిపారు పోలీసులు.
నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు.జులై 5న ఫ్రెండ్స్ తో కలిసి తిరుమలకు వచ్చాడని.. నడకదారిలో చిన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని చూసి దొంగతనానికి ప్లాన్ వేసాడని తెలిపారు పోలీసులు. నాలుగు రోజుల క్రితం జశ్వంత్ మళ్ళీ తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడని.. తిరుమల నుంచి జీప్ లో తిరిగి వెళ్తుండగా బుధవారం ( జులై 22) వేకువజామున విగ్రహాన్ని దొంగలించాడని తెలిపారు పోలీసులు.
బుధవారం రాత్రి హౌరా ఎక్స్ ప్రెస్ లో వెళ్తున్న నిందితుడిని ఒంగోలు రైల్వే స్టేషన్ లో జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తిరుమల టూ టౌన్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు. గురువారం అలిపిరి నడకమార్గంలోని ఏడవ మైలు దగ్గర ఆంజనేయస్వామి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా పునః ప్రతిష్టించారు అర్చకులు.
