షటిల్ ఆడుతూ.. గుండెపోటుతో సీఐ మృతి

షటిల్ ఆడుతూ.. గుండెపోటుతో సీఐ మృతి

ఏలూరు: సరదాగా షటిల్ ఆడుతున్న ఓ సీఐ గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖను ఘటన తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గణపవరం సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న డేగా భగవాన్ ప్రసాద్ (42) అటవిడుపుగా షటిల్ ఆడేవారు. మార్నింగ్ వాకర్స్ తోనూ సరదాగా గడిపేవాడు. ప్రతిరోజు వ్యాయామం తప్పక చేయాలంటూ అందరికీ చెప్పే ఆయన మంగళవారం సాయంత్రం షటిల్ ఆడుతూ ఆయాసంలో కూలబడిపోయాడు. ఆటలో అలసిపోవడం సాధారణమేనని అందరూ అనుకున్నారు. అయితే ఆయన గుండెనొప్పితో శ్వాసతీసుకోలేక ఇబ్బందిపడుతుండడం గుర్తించిన సహచరులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మార్గం మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సీఐ భగవాన్ ప్రసాద్ కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.  తుదిశ్వాస విడిచారు. 2003వ సంతవ్సరంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఎంపికైన ఆయన విధి నిర్వహణలోనే కాదు ఉన్నత చదువులు కొనసాగిస్తూ అంచలంచెలుగా పదోన్నతులు పొందారు. 2007లో ఆర్.ఎస్ఐగా, 2009లో సివిల్ ఎస్ఐగా, 2011లో సీఐగా ప్రమోషన్లు పొందారు. కుక్కనూరు,నల్లజెర్ల,తాడేపల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పనిచేసిన ఆయన సీఐగా ప్రమోషన్  వచ్చిన వెంటనే తాను తొలుత ఎస్.ఐగా ప్రమోషన్ పొందిన గణపవరం స్టేషన్ నే ఎన్నుకున్నారు. ఈ ప్రాంతంలో అందరితోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. ఆడుతూ పాడుతూ బాధ్యతలు నిర్వర్తించిన  భగవాన్ ప్రసాద్ 42 ఏళ్ల చిన్న వయసులోనే ఎవరూ ఊహించని విధంగా షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతిచెందడం విషాదం రేపింది.