ఆరు నెలల తర్వాత వీడిన కూకట్ పల్లి మర్డర్ మిస్టరీ

ఆరు నెలల తర్వాత వీడిన కూకట్ పల్లి మర్డర్ మిస్టరీ


కూకట్​పల్లి, వెలుగు: ఆరు నెలల క్రితం కూకట్​పల్లిలో జరిగిన  వ్యక్తి మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. చేతబడి చేశాడనే అనుమానంతో చిన్నాన్న కొడుకే ఈ హత్య చేసినట్లు తేల్చారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పెంటపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు చంద్రయ్య, ఆంజనేయులు, వెంకటస్వామి 20 ఏండ్ల క్రితమే సిటీకి వచ్చి కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్​లో ఉంటున్నారు. ఆంజనేయులు కొడుకు నక్క కృష్ణ(30) అదే ఏరియాలో పూలు అమ్మేవాడు.   కృష్ణ పెదనాన్న చంద్రయ్య, చిన్నాన్న వెంకటస్వామి, మేనత్త, ఆమె భర్త ఇలా ఒకరి తర్వాత ఒకరు ఏడాది వ్యవధిలో అనారోగ్యంతో చనిపోయారు. 7 నెలల క్రితం కృష్ణ చిన్నాన్న వెంకటస్వామి కొడుకు నక్క చందు కూతురి(9) బర్త్ డే ఫంక్షన్​కు కృష్ణ  వెళ్లాడు. నెలరోజుల తర్వాత చందు కూతురు అస్వస్థతకు గురైంది. ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల వరుస మరణాలు, అనారోగ్యానికి గల కారణాల కోసం   చందు జోతిష్యుల దగ్గరికి వెళ్లగా  చేతబడి వల్లే ఇలా జరుగుతోందని వారు చెప్పారు. దీంతో చందు తన నివాసాన్ని కూకట్​పల్లి నుంచి రామచంద్రపురానికి మార్చాడు.  కొన్నిరోజులకు కృష్ణ తండ్రి ఆంజనేయులు కూడా చనిపోయాడు. కృష్ణ చేతబడి చేసి కన్న తండ్రిని కూడా చంపేశాడని చందు అనుమానించాడు. కృష్ణను హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. జనవరి 3న  ప్రశాంత్​నగర్​లో ఒంటరిగా ఉంటోన్న కృష్ణ దగ్గరికి చందు వచ్చాడు.  అర్థరాత్రి 2 గంటలకు లేచి  రోకలి బండతో కృష్ణ తలపై కొట్టి హత్య చేశాడు. డెడ్ బాడీని గోనె సంచిలో పెట్టి కూకట్​పల్లి నల్లచెరువులో పడేశాడు.  మరుసటి రోజు డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చందు హత్య చేసినట్లు గుర్తించి సోమవారం అతడిని రిమాండ్​కు పంపారు.