నవీన్ పక్కా ప్లాన్‭తోనే వైశాలిని కిడ్నాప్ చేశాడు : పోలీసులు

నవీన్ పక్కా ప్లాన్‭తోనే వైశాలిని కిడ్నాప్ చేశాడు :  పోలీసులు

వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు.  గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో వైశాలికి నవీన్ రెడ్డితో పరిచయమైందని పోలీసులు గుర్తించారు. వైశాలి మొబైల్ నెంబర్ తీసుకున్న నవీన్ రెడ్డి తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేస్తుండేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని నవీన్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని వైశాలి చెప్పినట్లు సమాచారం. దీంతో వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నించాడు. అయితే వాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష్య పెంచుకున్నాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఇద్దరూ దిగిన ఫొటోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐదు నెలల క్రితం వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకొని తాత్కాలిక షెడ్డు వేశాడు. ఆగస్టు 31న గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం సందర్భంగా నవీన్ అతని ఫ్రెండ్స్ న్యూసెన్స్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు.. ఈ కేసులో ఇప్పటివరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నెల 9వ తేదీన వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు నవీన్ రెడ్డికి తెలిసింది.  దీంతో వైశాలిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. 9వ తేదీ మధ్యాహ్నం కార్లు,  డీసీఎంలో వైశాలి ఇంటికి వచ్చి.. అక్కడ ఉన్న 5 కార్ల అద్దాలను నవీన్ రెడ్డి స్నేహితులు ధ్వంసం చేశారు.  వైశాలి ఇంట్లోకి వెళ్లి సోఫా, టీ పాయి ధ్వంసం చేసి సీసీ కెమెరాల డీవీఆర్‭ను ఎత్తుకెళ్లారు.  వైశాలిని కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తర్వాత ఫోన్లు స్విచాఫ్ చేశారు. అయితే దారిలో నవీన్ ఫ్రెండ్ రుమాన్ తన ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు తమకోసం వెతుకుతున్నట్లు రుమాన్ కు తెలిసింది. దీంతో నవీన్ రెడ్డికి విషయం చెప్పి.. వైశాలిని వదిలి పెడదామని చెప్పాడు. తర్వాత కారులోంచి నవీన్ రెడ్డి అతని ముగ్గురు స్నేహితులు వెళ్లిపోయారు. అక్కడి నుంచి రుమాన్ వైశాలిని హైదరాబాద్ తీసుకొచ్చి వదిలేశాడు. ఇక నవీన్ రెడ్డి వాడిన వాహనాన్ని శంషాబాద్ దగ్గర పోలీసులు గుర్తించారు. మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.